NTV Telugu Site icon

Plastic Surgery: సినిమా స్టోరీకి మించి ట్విస్ట్‌.. కోట్లు దోచింది.. ప్లాస్టిక్‌ సర్జరీతో తప్పించుకుంది.. కానీ..!

Plastic Surgery

Plastic Surgery

Plastic Surgery: ఓ బ్యాంకు దోపిడీ కేసు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.. తాను పనిచేస్తున్న బ్యాంకుకు కోట్లాది రూపాయలు కన్నం వేసిన మహిళ.. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని.. పారిపోయింది.. మరోప్రాంతానికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది… పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది.. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1197లో చెన్ వైల్ 26 ఏళ్ల యువతి.. యెకింగ్ నగరంలో చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్కుగా పనిచేసేది.. బ్యాంకులోని లోపాలను గుర్తించిన ఆమె.. క్రమంగా బ్యాంకు ఖాతాల నుంచి తన ఖాతాలో 3.98 మిలియన్ యువాన్‌లను అంటే రూ. 4.77 కోట్లు మళ్లించింది.. నగరంలోని వివిధ బ్యాంకు శాఖల నుండి తన ఖాతాకు సొమ్మును మళ్లించింది.. ఇక, ఆ తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి.. ప్లాన్‌ చేసిన ఆమె.. ప్లాస్టిక్ సర్జరీతో తన రూపాన్ని మార్చుకుంది..

Read Also: Gun Firing: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం..

ఇక, ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి, 1.43 మిలియన్ యువాన్లను (రూ. 1.71 కోట్లు) బిల్డింగ్ చుట్టూ, బహిరంగ టాయిలెట్‌తో సహా వివిధ ప్రాంతాల్లో దాచింది. ఆ తర్వాత ప్రావిన్స్‌కి వెళ్లి 2.1 మిలియన్ యువాన్‌లను (రూ. 2.52 కోట్లు) ముగ్గురు తోబుట్టువులు కొత్తగా సృష్టించిన జాయింట్ బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టారు. అయితే, ఆమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు.. తిరిగి వచ్చి, తన నేరాన్ని అంగీకరించమని ఒత్తిడి తెచ్చారు.. కానీ, అదనపు డబ్బును బ్యాంక్‌ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి పాస్‌బుక్‌లను వారికి అందజేసింది వెళ్లిపోయింది.. తన మొదటి భర్తను సొంత ఊరిలోనే వదిలి.. ప్రావిన్స్ నుండి షాంఘైకి పారిపోయి.. జియాంగ్ పేరుతో కొత్త ఐడీ కార్డును పొందింది.. అక్కడ పేరు మార్చుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకుని ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు గతంలో ఓసారి పెళ్లయినా, ఆ విషయాలేవీ చెప్పకుండా, కొత్త రూపురేఖలతో రెండో పెళ్లి చేసుకుంది. కాలక్రమంలో ఆమె వ్యాపారవేత్తగా ఎదిగింది. అయితే, పోలీసులు 1997 నుంచి ఆమె కోసం వెదుకుతూనే ఉన్నారు. ఏమైతేనేం, ఇటీవల ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై పలు అభియోగాలతో కేసులు నమోదు చేశారు. ఆమె తన నేరాన్ని అంగీకరించింది మరియు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అవినీతి, మోసం మరియు తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న కేసులో ఆమెపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు..