NTV Telugu Site icon

Pakistan: పాక్‌లో బలూచ్ మిలిటెంట్లు చైనానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? భారత్ హస్తముందా..?

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ఓ వైపు తెహ్రీక్ ఇ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులతో సతమతం అవుతోంది. ఈ రెండు గ్రూపులు ఒకరు ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో విరుచుకుపుడుతున్నాయి. ముఖ్యంగా బీఏల్ఏ మిలిటెంట్లు పాకిస్తాన్ సైన్యం, పోలీసులతో పాటు చైనీయులను టార్గెట్ చేస్తున్నారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)‌లో ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కరాచీ విమానాశ్రయానికి సమీపంలో కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఇద్దరు చైనా జాతీయులు మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడానికి వారం రోజుల ముందు బాంబు పేలుడు సంభవించింది. బీఎల్ఏ చైనా ప్రాజెక్టుల్ని, ఆ దేశస్తుల్ని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దాడులు జరిగాయి. ఈ దాడిపై చైనా స్పందించింది. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చైనా పాకిస్తాన్‌ని కోరింది. తాజా జరిగిన దాడి కాన్వాయ్ పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందినది. పోర్ట్ ఖాసిమ్ ప్రాజెక్ట్ కరాచీ సమీపంలో రెండు బొగ్గు విద్యుత్ ప్లాంట్‌లను నిర్మిస్తుంది. ఇది సీపెక్‌లో భాగంగా ఉంది.

Read Also: High Court Telangana : ఆ విద్యార్థికి లోకల్‌ కోటాలో సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం..

చైనానే ఎందుకు లక్ష్యం:

పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ని జిన్నా ప్రభుత్వం బలవంతంగా భయపెట్టి కలుపుకుంది. చర్చల పేరుతో బలూచిస్తాన్ ప్రభుత్వ నేతని పిలిచి, బలవంతంగా సంతకం చేయించారు. 1947లో ఇది జరిగింది. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతూనే ఉన్నారు. ఈ తిరుగుబాటులో పాల్గొంటున్న వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేయడం, హత్యలు చేయడం జరిగింది. అనేక దశాబ్ధాలుగా అక్కడి ప్రజలు తీవ్ర అణిచివేతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎల్ఏ పాక్ ప్రభుత్వంపై దాడులు చేస్తోంది.

పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సుల, అతి తక్కువ జనాభా కలిగిన బలూచిస్తాన్‌ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సుని, గ్వాదర్ పోర్టుని కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ ప్రజల్లో ఉంది. దీంతో వారు చైనాపై దాడులు చేస్తున్నారు.

చైనాకు చమురు లేదా ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్కా జల సంధిపై ఆధారపడుతుంది. ఎప్పుడైనా భారత్‌తో ఉద్రిక్తలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని భారత్ దిగ్భందించవచ్చు. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది.

భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు:

బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి భారత్ మద్దతు ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ ఆధారిత థింక్ ట్యాంక్ AIERD యొక్క CEO అయిన షకీల్ అహ్మద్ రామీ ప్రకారం.. ఈ మిలిటెంట్లు విదేశీ శక్తుల ఎజెండాను నెరవేరుస్తున్నారని పరోక్షంగా భారత్‌ని ఉద్దేశించి అన్నారు. చైనా-పాక్ సంబంధాల్లో చిచ్చు పెట్టేందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, పలు సందర్బాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. ఇదే భారత్‌పై ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్‌కి కారణమవుతోంది.

Show comments