China: చైనా జీడీపీని ప్రశ్నిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త గావో షాన్వెల్(55) అనుమానాస్పదంగా మరనించారు. ఆయన అనారోగ్యంతో మరణించారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే, ఈ మరణంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గావో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడి సంస్థ SDIC సెక్యూరిటీస్లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థపై నిజాలు చెప్పే ఆర్థికవేత్తగా గావోకు పేరుంది.
2024లో వాషింగ్టన్‌లో గావో షాన్వెల్ చేసిన ప్రసంగం చైనాలో ప్రకంపనలు సృష్టించింది. గత రెండు మూడేళ్లుగా చైనా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు సగటున 2 శాతం మాత్రమే ఉందని, ప్రభుత్వం చెబుతున్న 5శాతం వాస్తవానికి దూరంగా ఉందని చెప్పారు. వినియోగం, ఉపాధి, రియల్ ఎస్టేట్ రంగాల్లో కనిపిస్తున్న బలహీనతల్ని ఆయన హైలెట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల తర్వాత చైనా ప్రభుత్వం గావోపై కఠిన చర్యలు తీసుకుంది. ఈయన బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించడంతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేసింది. దీని తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. హాంకాంగ్‌లోని పెట్టుబడి సలహాదారు లైసెన్స్ గడువు కూడా ముగిసింది.
గావో మరణానికి అనారోగ్యమే కారణమని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే, మరణించిన సమయం, అనారోగ్యానికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. మరోవైపు, 2025 ప్రారంభంలో గావోకు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన సన్నిహితులు చెప్పారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గావో మరణం తర్వాత చైనీస్ సోషల్ మీడియాలో చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. నిజం మాట్లాడిన ఆర్థికవేత్త అంటూ పోస్టులు పెడుతున్నారు.
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆ దేశం అణచివేస్తోంది. గతంలో కోవిడ్-19పై హెచ్చరికలు జారీ చేసిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్, ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యాపారవేత్త జాక్ మా వంటి వారిపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు గావో షాన్వెల్ హఠాన్మరణం కూడా ఇతే తరహా చర్చకు దారి తీసింది.

