China: చైనా సైన్యంలో కీలక జనరల్, 2017 డోక్లామ్, 2020 గల్వాన్ ఘర్షణకు బాధ్యుడిగా భావిస్తు్న్న జావో జోంగ్‌కిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చర్యలు తీసుకున్నారు. జావోను చైనాలోని అత్యున్నత రాజకీయ సలహా సంస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటిషియన్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్(CPPCC) నుంచి తొలగించడంతో పాటు మరో రెండు కీలక పదవుల నుంచి కూడా తప్పించారు. భారత సరిహద్దులో ఉన్న టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సులతో పాటు భారత్-చైనా సరిహద్దులోని చాలా ప్రాంతాలకు బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు ఇతను నాయకత్వం వహించాడు.
అయితే, అతడిని ఎందుకు తొలగించారనే దానిపై చైనా క్లారిటీ ఇవ్వలేదు. ఆయనపై అవినీతి, ఇతర చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన విచారణలు జరుగుతున్నాయా? అనేది ప్రకటించలేదు. చైనా సైన్యంలో జిన్ పింగ్ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగానే అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కీలక సభ్యులైన జాంగ్ యూషియా, లియూ జెన్‌లిలను కూడా చైనా తొలగించింది. వీరిద్దరు తీవ్రమైన క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు, విచారణ జరుగుతన్నట్లు రాయిటర్స్ నివేదించింది.
డోక్లామ్ సమయంలో జావో కీలక పాత్ర:
2016 ఫిబ్రవరి సమయంలో వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు జావో జోంగ్ తొలి కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017లో చైనా, భారత్ సైనికుల మధ్య 72 రోజుల పాటు డోక్లామ్ ప్రతిష్టంభన జరిగింది. దీనికి ఇతనే నాయకత్వం వహించారు. చైనా సైనికులు భూటాన్ భూభాగంలో రహదారి నిర్మించడాన్ని భారత్ అడ్డుకుంది. దీంతో డోక్లామ్ వివాదం మొదలైంది. ఆ సమయంలో చైనా వ్యవహరించిన తీరుకు జావోనే బాధ్యుడిగా తేలింది.
గాల్వాన్ ఘర్షణలో కూడా ప్రమేయం:
2020 మేలో తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు పెరిగాయి. జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భారత్ చేసిన దాడిలో పదుల సంఖ్యలో చైనా సైనికులు చనిపోయినట్లు అమెరికాతో సహా వెస్ట్రన్ మీడియా చెప్పింది. 2020లో అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ ఘర్షణలకు జావో జోంగ్ అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. భారత్‌కు ‘‘గుణపాఠం’’ చెప్పేందుకు ఈ చర్యను చేపట్టాలని ఆయన భావించినట్లు చెప్పింది. గల్వాన్ ఘర్షణల్లో నలుగురు అధికారులు మరణించినట్లు చైనా చాలా రోజుల తర్వాత చెప్పింది. ఈ సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని వెస్ట్రన్ మీడియా వెల్లడించింది. జావో 2020లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కమాండర్ పదవి నుంచి తప్పుకున్నాడు.
జావోపై ఇప్పుడే చర్యలు ఎందుకు:
ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా సంస్థ CPPCCలో జావోను స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ సంస్థలోని జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించారు. CPPCC సభ్యత్వాన్ని సైతం రద్దు చేశారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, అధికారిక పత్రిక పీపుల్స్ డైరీ ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలగింపుకు మాత్రం కారణాలు వెల్లడించలేదు.
చైనా సైన్యంలో జరుగుతున్న భారీ ప్రక్షాళనలో భాగంగా ఇతడిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో జాంగ్ యూషియా, లియూ జెన్‌లిలను సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి తొలగించారు. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న ఈ కీలక సంస్థలో ప్రస్తుతం జిన్‌పింగ్‌తో సహా ఇద్దరు యాక్టివ్ సభ్యులు మాత్రమే మిలిగినట్లు తెలుస్తోంది. అమెరికా థింక్‌ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ఫిబ్రవరి 2026 అంచనా ప్రకారం, PLAలోని 101 మంది సీనియర్ అధికారులు తొలగించబడ్డారు లేదా అదృశ్యమయ్యారు. ప్రస్తుతం చైనా, భారత్ మధ్య సరిహద్దు చర్చలు, సంబంధాలు సాధారణంగా మారుతున్న సమయంలో ఈ వార్త వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

