ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. తుపాకులు లేవు. మిస్సైళ్లు లేవు. కానీ ఇది భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన వార్..! ఈ యుద్ధం నీటిపై, కోట్ల మందికి జీవనాధారమైన ఒక నదిపై జరుగుతోంది. అవును..! బ్రహ్మపుత్ర నది(Brahmaputra River)పై వాటర్ వార్ మొదలైందనే చెప్పాలి. టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న ఒక భారీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇప్పుడు భారత్‌ను కలవరపెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును వాటర్ బాంబ్‌గా పిలుస్తున్నారు.
ఎందుకంటే ఈ డ్యామ్ పూర్తిగా పనిచేయడం మొదలైతే, బ్రహ్మపుత్రలో నీరు ఎప్పుడు రావాలి, ఎంత రావాలి అన్నది బీజింగ్ నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా నీరు వదిలితే అస్సాం, అరుణాచల్ లోయలు వరదల్లో మునిగిపోతాయి. ఒకవేళ నీరు ఆపితే నది ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
టిబెట్‌తో లింకేంటి?
ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. భారత్-చైనా మధ్య ఇప్పటికే సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు అదే పోరు నదుల వరకు చేరుతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక నది ఆయుధంగా మారితే ఏం జరుగుతుందో ఊహించడానికే భయం పుడుతుంది. నిజానికి బ్రహ్మపుత్ర కథ టిబెట్‌లో మొదలవుతుంది. అక్కడ ఈ నదిని యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. హిమాలయాల మధ్య జన్మించిన ఈ నది, భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు జీవనరేఖగా మారుతుంది.
ప్రాజెక్టు విలువెంత?
కోట్లాది రైతులు, మత్స్యకారులు, పట్టణాలు, గ్రామాలు ఈ నది సహజ ప్రవాహంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పుడు అదే నది మూలానికి దగ్గరగా చైనా ఒక అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు 168 బిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్టుతో భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది చైనా లక్ష్యం. దీనికోసం ఒకటి, రెండు డ్యామ్‌లు కాదు.. భారీ రిజర్వాయర్లు, లోతైన సొరంగాలు, భూగర్భ విద్యుత్ కేంద్రాలతో కూడిన వ్యవస్థను నిర్మించాలనుకుంటోంది. నిపుణుల మాటల్లో ఇది ఇప్పటివరకు ప్రయత్నించిన హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లలోనే అత్యంత ఆధునికమైనది..! అంతేకాదు అత్యంత ప్రమాదకరమైనది కూడా!
నది నియంత్రణ తప్పితే అంతేసంగతి:
ఈ ప్రాజెక్ట్ భయాన్ని పెంచే ప్రధాన కారణం దాని నిర్మిస్తున్న ప్రాంతం. ఇది భూకంపాలకు గురయ్యే సీస్మిక్ జోన్‌లో ఉంది. చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఒక చిన్న డిజైన్ లోపం, ఒక తప్పు అంచనా, ఒక ప్రకృతి విపత్తు జరిగితే దాని ప్రభావం నేరుగా దిగువ ప్రాంతాలపై పడుతుంది. నది నియంత్రణ తప్పితే, అది దేశాల సరిహద్దును దాటుతుంది. అందుకే భారత్ టెన్షన్ పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఈ ప్రాజెక్ట్‌ను టికింగ్ వాటర్ బాంబ్‌గా అభివర్ణించడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకవేళ ఎండాకాలంలో నీటిని నిల్వ చేస్తే.. నది సహజ ప్రవాహం దెబ్బతింటుంది. అప్పుడు వ్యవసాయం, మత్స్య సంపద, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
దశాబ్దాల క్రితం నాటి ఆలోచన:
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై అధికారికంగా స్పందించింది. టిబెట్‌లో బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో చైనా చేపడుతున్న ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం నిరంతరం గమనిస్తోందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచనలు 1986 నుంచే చైనాలో చర్చలో ఉన్నాయని, ఇప్పుడు అవి కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పింది. దిగువ ప్రాంతాల్లో నివసించే భారతీయుల ప్రాణాలు, జీవనోపాధిని రక్షించేందుకు అవసరమైన సరిదిద్దు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ విశ్లేషకుల మాట వేరేలా ఉంది. నది మూలం చైనా భూభాగంలో ఉన్నప్పుడు, భారత్ చేయగలిగేది పరిమితమే అవుతుంది.
మరోవైపు చైనా మాత్రం భారత్ వాదనను ఖండిస్తోంది. తమ ప్రాజెక్ట్ వల్ల దిగువ దేశాలకు ఎలాంటి నష్టం జరగదని చైనా విదేశాంగ శాఖ చెబుతోంది. ఇది పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి కోసమేనని, నీటి ప్రవాహాన్ని హానికరంగా మార్చబోమని హామీ ఇస్తోంది. కానీ ఈ మాటలు భారత్‌ను పూర్తిగా నమ్మించలేకపోతున్నాయి. కారణం చరిత్ర…! ఉదాహరణకు మెకాంగ్ నదిని తీసుకుంటే… చైనా ఎగువ భాగంలో నిర్మించిన ఈ డ్యామ్‌ల కారణంగా దిగువ దేశాలు తరచూ తీవ్ర ఎండలను ఎదుర్కొన్నాయని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ అవసరాల కోసం నీటి ప్రవాహాన్ని నియంత్రించడం వల్ల సహజ నది ఫ్లో దెబ్బతిన్నదని చాలా చెబుతున్నాయి. ఇదే అనుభవం బ్రహ్మపుత్రకు ఎదురవుతుందేమో అన్న భయం భారత్‌లో కనిపిస్తోంది.
ఇంకొక కీలక అంశం ఏంటంటే.. బ్రహ్మపుత్రకు ఎక్కువ నీరు భారత్‌లోని మాన్సూన్ వర్షాలు, ఉపనదుల నుంచే వస్తుంది. కానీ నిపుణుల మాటల్లో, అప్‌స్ట్రీమ్‌లో జరిగే చిన్న మార్పు కూడా నది సహజ ప్రవాహాన్ని ఆపగలదు. అందుకే ఈ పరిస్థితుల మధ్య భారత్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ హైడ్రోపవర్ సంస్థ బ్రహ్మపుత్రపై 11,200 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తోంది.
ఇది విద్యుత్ అవసరాల కోసమే కాకుకుండా నీటి భద్రత కోసమని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఒకే నదిపై రెండు దేశాలు పోటీగా మెగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తే ప్రమాదం మరింత పెరుగుతుందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ డ్యామ్‌ల పోటీ కొనసాగితే, అది కేవలం రెండు దేశాల సమస్యగా మిగలదు. ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. కోట్ల మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మొత్తానికి నీటిపై నియంత్రణ కోసం సాగుతున్న చైనా-భారత్ వాటర్ వార్‌లో తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం ఇరువైపులా నెలకొంది.
