China: చైనా మాజీ రక్షణ మంత్రులకు విధించిన మరణశిక్ష ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. కేవలం అవినీతి వల్లే వారికి ఈ శిక్ష పడిందని భావించినా, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న తాజా విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా మాజీ రక్షణ మంత్రులు వేయ్ ఫెంఘే, లీ షాంగ్‌ఫూలకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించిన 24 గంటలకే ఒక విస్తుపోయే నిజం బయటపడింది. వీరిద్దరిపై కేవలం అవినీతి ఆరోపణలే కాకుండా, దేశం పట్ల.. ముఖ్యంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పట్ల ‘అపనమ్మకం’, ‘నమ్మకద్రోహం’ చేసినట్లు అధికారికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతి కాదు.. అంతకు మించి..
తొలుత వీరిద్దరినీ అవినీతి ఆరోపణలపై పదవుల నుంచి తొలగించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా చైనా ప్రభుత్వ పత్రిక ‘పీఎల్ఏ డైలీ’ ప్రచురించిన ఒక వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “సైన్యంలోని అగ్రశ్రేణి అధికారులు ఎవరైనా నమ్మకద్రోహానికి తలపడితే వారి గతి ఏమవుతుందో ఈ తీర్పు రుజువు చేసింది” అని ఆ పత్రిక పేర్కొంది. వీరు తమ లక్ష్యాలను విస్మరించి, పార్టీ సూత్రాలను కాలరాశారని చైనా సైనిక విభాగం ఘాటుగా విమర్శించింది.
2023లో ఏం జరిగిందంటే..
వేయ్ ఫెంఘే 2018 నుంచి 2023 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత లీ షాంగ్‌ఫూ ఆ పీఠం ఎక్కారు. కానీ కొన్ని నెలలకే ఆయన అదృశ్యం కావడం, తర్వాత పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి.
వీరిద్దరినీ శిక్షించడం వెనుక అసలు కారణం 2023లో షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సాగిన కుట్ర అని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎల్ఏ డైలీ వాడిన ‘విశ్వాసఘాతుకం’ (Zhongcheng Shijie) అనే పదం సాధారణంగా రాజకీయ తిరుగుబాటు చేసే వారిపైనే చైనా ప్రయోగిస్తుంది. ఆయుధాలు పట్టుకున్న వారు మొట్టమొదట వఫాదార్‌లుగా (నమ్మకస్తులు) ఉండాలి అని చైనా సర్కారు స్పష్టం చేసింది. సీనియర్ నాయకులు తన పట్ల విధేయతను కోల్పోతే సహించేది లేదని జిన్‌పింగ్ ఈ మరణశిక్షల ద్వారా సైన్యానికి గట్టి సందేశాన్ని పంపారు. చైనా చరిత్రలో ఇంతటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులకు మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అశాంతిని, జిన్‌పింగ్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న కఠిన చర్యలను ప్రతిబింబిస్తోంది.
