China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్‌మెంట్!

  • 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం
  • రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్‌మెంట్!
  • కుమార్తె పరిశీలనతో వెలుగులోకి
China

China

చైనాలో ఓ 75 ఏళ్ల వృద్ధురాలి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా బ్యూటీ ట్రీట్‌మెంట్లు, కాస్మెటిక్‌ కోసం తన జీవితకాల పొదుపు మొత్తాన్ని ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఆమె ఖర్చు చేసిన మొత్తం రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే మార్కెట్ ధరల కంటే 10 నుంచి 20 రెట్లు అధికంగా కొన్ని చికిత్సలకు బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది.

చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ‘యూ’ అనే ఇంటిపేరుతో మాత్రమే గుర్తించిన ఈ మహిళ 2016 నుంచి యోంగ్‌కి బ్యూటీ అండ్ హెయిర్‌డ్రెస్సింగ్ కంపెనీ, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ బ్యూటీ క్లినిక్‌లో సేవలు తీసుకుంటున్నారు. తన తల్లి పదవీ విరమణ పొదుపు మొత్తం ఖర్చు చేసిన విషయం తెలుసుకున్న ఆమె కుమార్తె.. షాంఘైలోని ఓ టెలివిజన్ కార్యక్రమాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏళ్లుగా బ్యూటీ ట్రీట్‌మెంట్ల కోసం ఖర్చు

యూ వివిధ రకాల కాస్మెటిక్‌, వెల్‌నెస్ సేవలను పొందినట్లు బిల్లులు, చికిత్స రికార్డుల ద్వారా వెల్లడైంది. చర్మాన్ని బిగుతుగా మార్చే ట్రీట్‌మెంట్లు, థ్రెడ్ లిఫ్టింగ్‌, మెరిడియన్ మసాజ్ వంటి చికిత్సలు చేయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కనుబొమ్మలు, పెదవులకు టాటూ వేయించుకునే విధానాలను కూడా ఆమె చేయించుకున్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఏళ్లుగా జరిగిన ఈ ఖర్చు మొత్తం ఆమె కుమార్తె బిల్లులు, చికిత్స రికార్డులను పరిశీలించిన తర్వాతే బయటపడింది.

మార్కెట్ ధర కంటే 20 రెట్లు ఎక్కువగా బిల్లులు?

తన తల్లి ఖర్చులపై కుమార్తె అనుమానం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. చికిత్సలకు వసూలు చేసిన ధరలేనని తెలుస్తోంది. కొన్ని చికిత్సలకు సాధారణ మార్కెట్ ధరల కంటే 10 నుంచి 20 రెట్లు అధికంగా బిల్లులు చెల్లించినట్లు పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఒకే సెషన్‌లో పలు విధానాలతో పెదవులకు టాటూ వేసిన చికిత్సకు 39,800 యువాన్లు (సుమారు రూ.6 లక్షలు) చెల్లించినట్లు నివేదిక పేర్కొంది. ఇలాంటి చికిత్సలకు సాధారణంగా ఉండే ధరలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడంతో.. వృద్ధురాలిని కొన్నేళ్లుగా ఖరీదైన ట్రీట్‌మెంట్లు తీసుకునేలా ఒత్తిడి చేశారా? లేదా తప్పుదోవ పట్టించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వృద్ధ వినియోగదారుల భద్రతపై చర్చ

ఈ ఘటన చైనాలో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. బ్యూటీ, వెల్‌నెస్ పరిశ్రమలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దూకుడైన విక్రయ పద్ధతులు ఉపయోగిస్తున్నారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. వృద్ధ వినియోగదారులు భారీ మొత్తాలను కాస్మెటిక్‌, వెల్‌నెస్ సేవలపై ఖర్చు చేయకుండా మరిన్ని వినియోగదారుల రక్షణ చర్యలు అవసరమా? అనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఆరోపణలు, ఖర్చుల వివరాలపై వివాదం కొనసాగుతోంది. వృద్ధురాలి నుంచి వసూలు చేసిన మొత్తాలు, సేవల ధరలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.