Turkey Earthquake: టర్కీలో వరసగా వచ్చిన భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటి వరకు 5000కు పైగా మరణించారు. శిథిలాలు వెలికితీస్తుంటే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వరసగా రెండు రోజలు వ్యవధిలో 100కు పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంతపెద్ద భారీ భూకంప టర్కీలో సంభవించడానికి అసలు కారణం ఏమిటి.. టర్కీ తరుచుగా భూకంపాలకు ఎందుకు గురువుతుంది..? అనేది జనాల్లో వస్తున్న సందేహం.
టెక్టానిక్ ప్లేట్ల కదలికే అసలు కారణం:
అసలు టర్కీ ఉన్న భూభాగం మొత్తం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది. సాధారణంగా మన భూమి ఉపరితలం 15 పలకలుగా ఏర్పడ్డాయి. ఈ పలకలు తరుచుగా ఏదో వైపు కదులుతూనే ఉంటాయి. టర్కీ మొత్తం అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ పై ఉంది. ఇది యరేషియన్, ఆఫ్రికన్, అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ మధ్య ఉంది. అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ అపసవ్య దిశలో కదులుతోంది. ఇదే సమయంలో అరేబియా ప్లేట్ అనటోలియన్ ప్లేట్ ను నెట్టేస్తోంది. ఇలా అనటోలియన్ ప్లేట్ ను నెట్టేసిన సమయంలో ఇది యూరేషియన్ ప్లేట్ ను ఢీకొడుతోంది. ఇలా ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల, భూగర్భంతో సర్దుబాటు ఫలితంగా భారీగా శక్తి విడులయ్యే శక్తి భూకంపం రూపంలో బయటకు వస్తోంది.
Read Also: Rajasthan: ఒంటెను చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు.. నేరం ఏమిటో తెలుసా..?
ఇలా ఒక పలకతో మరో పలక కలిసే ప్రాంతాన్ని ఫాల్ట్ లైన్ గా పేర్కొంటారు. అనటోలియన్, యూరేషియన్ ప్లేట్లు కలిసే ఉత్తర అనటోలియన్ ఫాల్ట్ లైన్ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంపమండలాల్లో ఒకటి. ఇక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలా టెక్టానిక్ ప్లేట్ల సర్దుబాటు ఫలితంగానే టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూమిపై టెక్టానిక్ ప్లేట్ల కదలికలే భూకంపాలకు, సునామీలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో హిమాలయ ప్రాంతం కూడా ఎప్పుడో ఓ సమయంలో భారీ భూకంపాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది ఉత్తర దిశగా కదులుతూ.. యూరేషియా ప్లేట్ ను ముందుకు నెడుతోంది. ఇది కొన్ని లక్షల ఏళ్లుగా కొనసాగుతోంది. దీని ఫలితంగానే హిమాలయాలు ఏర్పడ్డాయి.