NTV Telugu Site icon

Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..

Double 6 Incident

Double 6 Incident

Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.

బుధవారం విడుదల చేసిన 21 పేజీల నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి నోమాడ్ విమానం మలేషియా సబా రాష్ట్ర రాజధాని కోట కినాబాలులో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులతో పాటు పైలెట్ మరణించాడు. జూన్6 న జరిగిన ఈ ఘటనను మలేషియా ప్రభుత్వం ‘డబుల్ సిక్స్’ సంఘటనగా పిలుస్తుంది. సబా ముఖ్యమంత్రి తున్ ఫువాడ్ స్టీఫెన్స్ మరియు రాష్ట్ర గృహ మరియు స్థానిక ప్రభుత్వ మంత్రి, ఆర్థిక మంత్రి మరియు కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రి మరణించారు. బాధితుల బంధువులు, ప్రజల నుండి వచ్చిన డిమాండ్లకు ప్రతిస్పందనగా నివేదికను విడుదల చేయనున్నట్లు ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ నెల ప్రారంభంలో చెప్పారు.

Read Also: USA: టెక్సాస్‌లో భారీ పేలుడు.. 18,000 ఆవులు మృతి

నివేదిక ప్రకారం విమానం నడిపే సమయంలో పైలెట్ మత్తులో లేదని, అయితే విమానం పనితీరు, పైలెట్ పనితీరును తెలిపే లాగ్ బుక్స్ లో ఒకటి కాలిపోయినట్లు, మరొకటి దొంగిలించబడింది. అయతే రికార్డుల్లో పైలెట్ పనితీరు, శిక్షణ సరిగ్గా లేనట్లు తేలింది. విమానం నడుపుతున్న సమయంలో అతడు అలసటతో ఉన్నట్లు, కడుపు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలసింది. అయితే ఇవేవి దుర్ఘటనకు కారణం కాదని తెలిసింది.

నిజానికి ఇద్దరు పైలెట్లు ఉండాల్సిన విమానంలో ఒక్కరే పైలెట్ ఉన్నాడు. విమానం ఎక్కిన మొత్తం 10 మంది ప్రయాణికుల్లో ఒకరు కో పైలెట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే అంతకుముందు వెళ్లిన ఓ విమానం ప్రయాణికలుకు సంబంధించిన లగేజీని కూడా ఈ విమానంలోనే ఎక్కించారు. ఈ లగేజీని సరిగ్గా లోడ్ చేయలేదు. దీని కారణంగా విమానం గురుత్వాకర్షణ కేంద్రాన్ని ప్రభావితం చేసింది. అయితే పైలెట్ టేకాఫ్ చేసే సమయంలో లోడ్ సరిగ్గా లేదనే విషయాన్ని గమనించలేదు. దీని కారణంగానే విమానం ల్యాండిగ్ సమయంలో కుప్పకూలి ప్రముఖ రాజకీయ నాయకులు మరణించారు. ఈ విమానానికి సంబంధించి జనవరి 25, 1977న నివేదిక తయారు చేసినా.. ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. చివరకు 47 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసింది.