Captain Smit Machhar: విమానంలో తీవ్ర సంక్షోభం ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II, ఫస్ట్ క్లాస్’ పురస్కారంతో సత్కరించింది. గాయపడిన చేతికి బ్రేస్ ధరించి తన సహచర సిబ్బందితో కలిసి వేడుకకు హాజరైన కెప్టెన్ స్మిత్‌ను చూసి అక్కడి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన ధైర్యం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు విమానయాన రంగంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో పాటు రెండు ఎమిరేట్ల రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కెప్టెన్‌తో పాటు విమాన సిబ్బందిని కూడా సత్కరించారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి ఈ గుర్తింపు లభించింది.
‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారం ప్రత్యేకత ఏమిటి?
‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ అనేది UAEలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పౌర, సైనిక గౌరవాల్లో ఒకటి. దేశానికి, సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులకు ఇటువంటి గౌరవాలను ప్రదానం చేస్తారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ విమాన సిబ్బందికి పతకాలను అందజేస్తూ, సంక్షోభ సమయంలో వారు ప్రదర్శించిన ధైర్యం, బాధ్యత, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం UAE విమానయాన రంగంలోని ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒమన్‌కు చెందిన కో- పైలట్ కాక్‌పిట్‌లో దాడికి పాల్పడటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా వ్యవహరించి తీసుకున్న నిర్ణయాల అనంతరం విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి దాడికి పాల్పడిన కో- పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అకుంఠిత ధైర్యాన్ని ప్రదర్శించి 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.
ప్రధాని మోడీకి, కెప్టెన్ స్మిత్‌కు ఇజ్రాయెల్ ఆహ్వానం?
ఇదిలా ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ నుంచి ఆహ్వానం అందింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు.
తీవ్రమైన పరిస్థితుల్లోనూ బాధ్యతను విస్మరించకుండా వ్యవహరించిన విమాన సిబ్బందిని గౌరవించడం విమానయాన రంగంలో భద్రత, వృత్తిపరమైన నిబద్ధత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు UAE అందించిన గౌరవం ఆయన ధైర్యాన్ని గుర్తించే చర్యగా నిలుస్తోంది.
Terror was met with courage. Courage was met with honour.
President Sheikh Mohamed bin Zayed embraces Captain Smit Machchhar, hero of flydubai Flight FZ1073, honoured with the Order of Zayed II.
In the UAE, bravery knows no nationality. Heroes are treated as heroes. 🇦🇪🇮🇳 https://t.co/338raPFbyZ
— Mona Alhmoudi، منى الحمودي (@monaalhmoudi) October 27, 2026

