Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖలిస్తాన్ మద్దతుదారుడు న్యూ డెమెక్రాటిక్ పార్టీ(ఎన్డీపీ) చీఫ్ జగ్మీత్ సింగ్ ఓడిపోయాడు. తన స్థానాన్ని గెలవకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ అధికారం నిలుపుకున్నప్పటికీ, మెజారిటీ ప్రభుత్వానికి తగినంత బలం సాధించడంలో సక్సెస్ కాలేదు.
Read Also: Vaibhav Suryavanshi : 8 ఏళ్ళ వయసులో ధోనీ కోసం… వైభవ్ చిన్ననాటి ఫోటో వైరల్…!
బ్రిటిష్ కొలంబియాలోని బర్నాబీ సెంట్రల్ సీట్ నుంచి పోటీ చేసిన జగ్మీత్ సింగ్ లిబరల్ పార్టీ అభ్యర్థి వాడే చాంగ్ చేతిలో ఓడిపోయారు. సింగ్‌కి 27 శాతం ఓట్లు రాగా, చాంగ్ 40 శాతానికి పైగా ఓట్లు సాధించారు. జగ్మీత్ సింగ్ ఎన్డీపీ పార్టీ కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జాతీయ పార్టీ హోదాకు అవసరమయ్యే 12 సీట్లను సాధించలేకపోతోంది. దీంతో ఆ పార్టీ జాతీయ హోదా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
46 ఏళ్ల జగ్మీత్ సింగ్ ఓటమి పట్ల నిరాశ చెందానని అన్నారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం లిబరల్స్ 164 సీట్లలో ముందంజలో ఉన్నారు. 147 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ నిలిచింది. ఓట్లు ఇంకా లెక్కించబడుతున్నాయి. నిజానికి, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రేకు ప్రజా మద్దతు ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. అయితే, ట్రూడో దిగిపోయి, కార్నీ ప్రధాని అయిన తర్వాత ప్రజల నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పియార పోయిలివ్రే ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అతడి పార్టీ బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించే దిశగా పయనిస్తోంది.
