Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ చేపట్టక ముందే పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా యూరప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుంటే యూరోపియన్ యూనియన్(ఈయూ)పై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు. ఈయూ, అమెరికాతో విపరీతమైన వాణిజ్య అంతరాన్ని తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. యూరప్ తన చమురు, గ్యాస్‌లో ఎక్కువ భాగం అమెరికా నుంచి కొనుగోలు చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ‘‘టారిఫ్’’ విధిస్తామని చెప్పారు.
Read Also: Revanth Reddy: థియేటర్లోనే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తే కానీ అల్లు అర్జున్ కదల్లేదు!
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మన చమురు, గ్యాస్‌ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అమెరికా వారితో విపరీతమైన లోటును భర్తీ చేయాలని యూరోపయిన్ యూనియన్‌కి చెప్పాను. లేకపోతే అన్ని విధాలుగా టారిఫ్‌లు ఉంటాయి’’ అని హెచ్చరించారు.
తాజా యూఎస్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈయూ, అమెరికాతో వాణిజ్య లోటు 202.5 బిలియన్ డాలర్లుగా ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అమెరికా దిగుమతులు ఈ ఏడాది 553.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈయూకి దిగుమతులు 350.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వాణిజ్య అసమతుల్యతను త్వరితగతిన పరిష్కరించాలని డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఒక్క యూరప్‌ని మాత్రమే కాదు, కెనడా, చైనా, మెక్సికోలపై కూడా సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కెనడా, మెక్సికోలపై 25 శాతం దిగుమతి సుంకాలను, చైనాపై 10 శాతం సుంకాలను ప్రకటించారు.