NTV Telugu Site icon

Israel: గాజా చుట్టుపక్కల 1500 మంది హమాస్ ఉగ్రవాదులు హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటన..

Isreal

Isreal

Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదులకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ పైకి హమాస్ ఏకంగా 5000 రాకెట్లతో గాజా స్ట్రిప్ నుంచి దాడి నిర్వహించింది. ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి వందల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో రెండు వైపుల 1600 మంది మరణించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ సైన్యం గాజాపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజాలోని ప్రజలు అక్కడి నుంచి ఈజిప్టు పారిపోవాల్సిందిగా ఇజ్రాయిల్ హెచ్చరించింది.

Read Also: Justin Trudeau: తీరుమార్చుకోని ట్రూడో.. యూఏఈ తర్వాత జోర్డాన్‌తో భారత్-కెనడా వివాదంపై చర్చ..

ఇదిలా ఉంటే గాజాస్ట్రిప్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) మంగళవారం ప్రకటించింది. ఇజ్రాయిల్ వైమానిక దళం పాలస్తీనా ఎన్‌క్లేవ్ ను దెబ్బతీసిందని, భద్రతా బలగాలు గాజా సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ సాధిస్తున్నాయని సైనిక ప్రతినిధి రిచర్డ్ హెట్జ్ మీడియాకు వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి సరిహద్దు దాటి ఎవరూ లోనికి రాలేదని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చొరబాట్లు జరుగుతున్నాయని అన్నారు. సరిహద్దు నుంచి ప్రజల తరలింపును సైన్యం పూర్తి చేసిందని వెల్లడించారు.

ఇప్పటి వరకు యుద్ధంలో 1600 మంది మరణిస్తే.. ఇందులో హమాస్ దాడుల వల్ల 900 మంది ఇజ్రాయిలీలు మరణించారు. మరోవైపు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ దాడుల్లో 704 మంది ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయిల్ కి అమెరికా, యూకేలు మద్దతు ప్రకటించాయి.