Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్‌”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

Jaffar Express

Jaffar Express

Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’పై బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ దాడికి పాల్పడింది. క్వెట్టా కంటోన్మెంట్‌ నుంచి పాక్ ఆర్మీ సైనికులతో వెళ్తున్న ఈ రైలును బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని, ఒక సిగ్నల్ క్రాసింగ్ వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో పెషావల్ వెళ్తున్న అనేక మంది సైనికులు, ఈద్ కోసం వెళ్తున్న వారు ఉన్నారు. బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేసింది.

జాఫర్ ఎక్స్‌ప్రెస్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?

పాకిస్తాన్ లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణించే జాఫర్ ఎక్స్‌ప్రెస్ కీలక పట్టణాల నుంచి వెళ్తుంది. జకోబాబాద్, సుక్కూర్, రహీంయార్ ఖాన్, బహవల్పూర్, ముల్తాన్, లాహోర్, గుజ్రాన్‌వాలా, రావల్పిండి మీదుగా పెషావర్ వెళ్తుంది. పాకిస్తాన్‌లో ప్రధాన నగరాలను పట్టణాల గుండా వెళ్తుంది. ముఖ్యంగా కల్లోలిత, తిరుగుబాటు కలిగిన బలూచిస్తాన్‌లో పనిచేసేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ అధికారులు ప్రయాణించేందుకు ఈ రైలునే ఉపయోగిస్తారు. అందుకే ఈ ట్రైన్‌ టార్గెట్ అవుతుంది.

ముఖ్యంగా బలూచిస్తాన్ నుంచి పంజాబ్ వెళ్లేవారు చాలా మంది ఈ ట్రైన్‌లో ఉంటారు. పాక్ ఆర్మీలో పంజాబీలే అధికారం, వీరినే బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఈద్ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపేందుకు పాక్ భద్రతాధికారులు ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు.

హైజాక్, వరస దాడులు:

ట్రైన్ హైజాక్ చేయడం చాలా అరుదుగా వింటుంటాం. 2025లో బీఎల్ఏ ఫైటర్స్ ఏకంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. బలూచిస్తాన్‌లో మారుమూల సిబీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో దాడి చేసి రైలును నిలిపేశారు. బీఏల్ఏ ఏకంగా 450 మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది. .ఈ ఘటనలో దాదాపుగా 150 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని బీఎల్ఏ ఊచకోత కోసింది. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ సభ్యుల్ని విడిపించాలనే షరతుకు పాక్ అంగీకరించలేదు. దీంతో పాక్ సైనికుల్ని హతమార్చింది.

నిజానికి 2024 నవంబర్ నెలలో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ ఈ దాడిని బీఎల్ఏ నిర్వహించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. అప్పటి నుంచి క్వెట్టా-పెషావర్ మధ్య రైలుని రద్దు చేశారు. మళ్లీ సర్వీస్‌ని పునరుద్ధరించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే ట్రైన్ హైజాక్‌కి గురైంది. ఇదే కాకుండా చాలా సార్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్ టార్గెట్‌గా పట్టాలపై బాంబులు పెట్టి నిలిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.