Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు.
Read Also: Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ దళాలపై 24 గంటల్లో ఇది రెండో దాడి. ఒక రోజు ముందు, హర్నైలో బాంబు డిఫ్యూజ్ స్వ్కాడ్ రైల్వే ట్రాక్‌ని క్లియర్ చేస్తున్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ వారం ప్రారంభంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుని బోలాన్ ప్రాంతంలో హైజాక్ చేసింది. ఈ ఘటనలో 200 మంది పాకిస్థానీ సైనికులు, ఐఎస్ఐ సిబ్బందిని పట్టుకుంది. తమకు చెందిన ఖైదీలను పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే అందర్ని చంపేస్తామని అల్టిమేటం విధించింది.
ఖైదీల విడుదల గడువు ముగియడంతో, తమ బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఇచ్చిన 48 గంటల సమయాన్ని పాకిస్తాన్ పట్టించుకోలేదని చెప్పారు. పాకిస్తాన్ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, మెండితనంతో 214 మంది బందీలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ప్రకటనలో బీఎల్ఏ పేర్కొంది. అంతకుముందు, పాకిస్తాన్ రైలు హైజాక్ ఘటనను 36 గంటల్లో ముగించామని పాక్ ఆర్మీ వెల్లడించింది. 30 మంది మిలిటెంట్లను చంపేసి, బందీలను రెస్క్యూ చేశామని ప్రకటించింది. అయితే, బీఎల్ఏ ఈ వాదనల్ని తప్పుపట్టింది.