NTV Telugu Site icon

Super Moon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న “సూపర్ మూన్”

Super Moon

Super Moon

ఆకాశంలో అద్బుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రానున్నాడు. దీంతో సూపర్ మూన్ ఏర్పడబోతోంది. 2022లో మొత్తం నాలుగు సార్లు సూపర్ మూన్ కనువిందు చేయనున్నాయి. తాజాగా ఏర్పడుతున్న సూపర్ మూన్ మూడోది. తరువాతి సూపర్ మూన్ ఆగస్టు 12న కనిపించనుంది. పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించిన సందర్భంలో, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో ఈ సూపర్ మూన్ లు ఏర్పడుతుంటాయి. సాధారణ పౌర్ణమి సందర్భాల్లో కన్నా చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపిస్తాడు.

జూలై 13 తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సూపర్ మూన్ కనువిందు చేయనుందని నాసా వెల్లడించింది. సాధారణంగా చంద్రుడు, భూమి మధ్య సగటున 3,84,400 కిలోమీటర్ల ఉంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కోసారి అత్యంత దగ్గరగా ( పెరీజీ), అత్యంత దూరంగా ( అపోజీ) వెళ్తుంటుంది. జూలై 13న చంద్రుడు భూమికి 3,63,300 కిలోమీటర్ల దూరంలోకి వస్తున్నాడు. దీంతో సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా..30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Read Also: Sri Lanka : శ్రీలంకలో కల్లోలం, శృతిమించిన ఆందోళనలు…!

సూపర్ మూన్ భారతదేశ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ( గురువారం) 12.08 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. వరసగా మూడు రోజుల పాటు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్ మూన్ ను బక్ సూపర్ మూన్, థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. సాధారణం కన్నా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించడంతో దీన్ని సూపర్ మూన్ గా వ్యవహరిస్తుంటారు.