కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యి, ఫాంగ్‌షాన్ జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించారు.
బీజింగ్‌లోని నాంగ్జిన్యూన్ రెసిడెన్షియల్ కాంపౌండ్‌లో 26 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే.. అధికారులు రాత్రికి రాత్రే ఆ ఏరియా నుంచి సుమారు 13 వేల మందిని క్వారంటైన్‌కు తరలించింది. ఆహారం డెలివరీలు చేసే రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా థియేటర్లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారు. పార్కులను మాత్రం 30శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. బీజింగ్‌లోని ఈ ఐదు జిల్లాలకు చెందిన ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించింది. మే 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
వైరస్ కట్టడికి చైనా అవలంభిస్తున్న జీరో-కొవిడ్ విధానంపై దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోంది. విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. బీజింగ్ యూనివర్సిటీ, పెకింగ్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఇటీవల నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో… విద్యాసంస్థల్లో ఆంక్షలపై అధికారులు వెనక్కి తగ్గారు. షాంఘైలో స్థానికులు పోలీసులు, వాలంటీర్లతోనూ ఘర్షణలకు దిగుతున్నారు. అయితే, ఈ ఆంక్షల ఫలితంగా ఇతర దేశాల కంటే మరణాలను తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది.