Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!

  • బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచక పరిస్థితులు..
  • షేక్ హసీనా రాక ముందే బాంబు దాడులు..
  • హసీనా పార్టీనే కారణమని ప్రభుత్వ ఆరోపణలు..
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. వీధుల్లో నాటుబాంబుల పేలుళ్లు, బస్సులకు నిప్పటించడం, రహదారుల దిగ్భంధం, పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. రాజధాని ఢాకాతో పాటు గోపాల్‌గంజ్, షరియత్‌పూర్ సహా పలు జిల్లాలో కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతన్నాయి. డిసెంబర్ నెలలో సొంత దేశానికి వెళ్తానని షేక్ హసీనా ప్రకటించింది. దీనికి ముందే బంగ్లాదేశ్‌లో మరోసారి అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి.

హసీనా పార్టీపై బంగ్లా నేతల ఆరోపణలు..

2024 ఆగస్టులో హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో హసీనా దేశాన్ని విడిచిపెట్టి భారత్ పారిపోయిరావాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో తన సొంత దేశానికి వెళ్తానని ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల వెనక షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఉందని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఆరోపిస్తోంది. గురువారం తెల్లవారుజామున కుష్టియా నియోజకవర్గానికి చెందిన మహిళా రిజర్వ్డ్ స్థానంలో ఎన్‌సీసీ ఎంపీగా ఉన్న నుస్రత్ తబస్సుమ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, నిప్పంటించారు. ఈ దాడికి అవామీ లీగ్ కార్యకర్తలు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనికి ముందు నవంబర్ 11న ఢాకాలో రెండు బస్సులు, ఒక ట్రక్కుకు నిప్పంటించారు. నవంబర్ 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా కనీసం 22 అగ్నిప్రమాదాలు, నాటు బాంబు పేలుళ్ల ఘటనలు నమోదయ్యాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో భద్రతా బలగాలు వందలాది మందిని అరెస్ట్ చేశాయి. అవామీ లీగ్ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ నవంబర్ 10న దేశవ్యాప్త దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో ఈ ఘర్షణలు రాజకీయ రంగు పులుముకున్నాయి.

అధికార పక్షంపై విమర్శలు..

ఓవైపు అధికార బీఎన్పీ ఈ అల్లర్లు హసీనా పార్టీ అవామీ లీగ్ కారణమని చెబుతుంటే, అల్లర్లకు అధికార బీఎన్పీ కారణమని జమాతే ఇస్లామీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. షేక్ హసీనా రాకను అడ్డుపెట్టుకుని బీఎన్పీనే హింసకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. దేశంలో అరాచక పరిస్థితుల్ని ప్రభుత్వమే సృష్టిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు కారణమే…

బంగ్లాదేశ్‌లోని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో కార్మికుల నిరసనలు కూడా హింసాత్మక పరిస్థితులకు మరో ప్రధాన కారణంగా మారాయి. ప్రస్తుతం నెలకు 12,500 టాకాలుగా ఉన్న కనీస వేతనాన్ని 30,000 టాకాలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదట్లో ఢాకా, గాజీపూర్, సావర్ ప్రాంతాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. కార్మికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. ఈ నిరసనలకు కూడా అవామీలీగ్ అనుబంధ కార్మి సంఘాలు, పార్టీతో సంబంధం ఉన్న ఫ్యాక్టరీ యజమానులే కారణమని ఆ దేశ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ ఆరోపించారు.