NTV Telugu Site icon

Bangladesh: తీవ్ర ఉద్రిక్తతల మధ్య రేపు బంగ్లాదేశ్‌ ఎన్నికలు..నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా..!

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో షేక్ హసీనాకు తిరుగులేకుండా పోయింది. ఎన్నికలకు వ్యతిరేకంగా బీఎన్పీ హింసాకాండకు పాల్పడుతోంది. అక్రమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికలను బహిష్కరిస్తూ, దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే 48 గంటల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఎన్పీ సిద్ధమైంది. దేశ రాజ్యాంగ ప్రక్రియకు అంతరాయం కలిగించొద్దని ప్రధాని షేక్ హసీనా ఆందోళనకారుల్ని కోరింది.

బంగ్లాదేశ్‌లో మొత్తం 11.9 కోట్ల మంది ఓటర్లు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 42,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు 27 రాజకీయ పార్టీల నుంచి 1,500 మందికి పైగా అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న 12వ సాధారణ ఎన్నికలను భారత్‌కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.

Read Also: Drinking water: కస్టమర్‌కి “రెగ్యులర్ వాటర్” ఇవ్వని కేఫ్.. రూ. 20,000 ఫైన్..

రేపు ఎన్నికలు జరుగుతుండగా.. జనవరి 8న ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఆ దేశ ఎన్నికల సంఘం అంచనా వేసింది. అవినీతి ఆరోపణలపై ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా(78), ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఎన్నికలను బహిష్కరించడంతో ప్రధాన మంత్రి హసీనా అధికార అవామీ లీగ్ వరుసగా నాలుగోసారి లాంచనంగా మారింది.

సమ్మెకు పిలుపునిచ్చిన బీఎన్పీ, ప్రభుత్వం ఎలాంటి ఎన్నికలు జరపొద్దని వార్నింగ్ ఇస్తోంది. ప్రభుత్వం రాజీనామా చేసి, పార్టీయేతర తటస్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది ఆందోళనల్లో పాల్గొన్న ఆ పార్టీ మద్దతుదారుల్ని 10 వేలకు పైగా మందిని షేక్ హసీనా ప్రభుత్వం జైళ్లలో వేసింది. ఓటింగ్ వేళ శాంతిభద్రతను కాపాడేందుకు బంగ్లా ఆర్మీని దేశవ్యాప్తంగా మోహరించారు.

బంగ్లాదేశ్‌లో లౌకికవాద ప్రభుత్వానికి షేక్ హసీనా ప్రాధాన్యత ఇస్తున్నారు. హసీనా 2009 నుంచి అధికారంలో ఉన్నారు. భారత్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఎన్పీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఆహార దిగుమతులు మందగించి, బంగ్లా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. 4.7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్‌ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.