Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. విద్యార్థుల హింసాత్మక ఆందోళనల తర్వాత 2024 ఆగస్టులో దేశం విడిచిపెట్టి భారత్ వచ్చిన షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే ఓ సంచలన వివాదం తెరపైకి వచ్చింది. 2024లో షేక్ హసీనా రాజీనామకు ముందు, ఆమె ప్రభుత్వం కుప్పకూలడానికి ముందే ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థి నిరసనకారులు మహ్మద్ యూనస్‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ చర్చలకు ప్రముఖ ఫ్రెంచ్ వార్తా సంస్థ ఏఎఫ్‌బీ జర్నలిస్ట్ ఖాదరుద్దీన్ షిషిర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ ఆలం వెల్లడించారు.
షేక్ హసీనా ఇంకా దేశం విడిచిపెట్టక ముందే, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారత్ వచ్చేయడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఏడాదిన్నర కాలం పాటు యూనస్ బంగ్లాను పాలించారు. షఫీకుల్ ఆలం ఫేక్‌బుక్ పోస్టుతో బంగ్లాలో ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆపరేషన్ చాలా ప్రణాళికబద్ధంగా జరిగిందనేది అర్థమవుతోంది.
జర్నలిస్ట్ మధ్యవర్తిత్వం..
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది హసీనా పారిపోయేలా చేసింది. ఆగస్టు 5, 2024న హసీనా ఢాకా నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. ఈ పరిణామాలకు ముందే యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు సంప్రదింపులు చేశారని ఆలం తన ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు. యూనస్‌ను సంప్రదించే విషయంలో జర్నలిస్ట్ ఖాదరుద్దీన్ షిషిర్ సహాయం చేశాడని తెలిపారు. 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా ఆహ్వానించే ప్రక్రియలో షిషిర్ కీలక పాత్ర పోషించాడని వెల్లడించారు.
ఆగస్టు 6న యూనస్ పేరు ప్రకటన..
హసీనా ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్‌ను వీడితే, ఆగస్టు 6న విద్యార్థి నాయకులు దేశాన్ని నడిపించే బాధ్యతను యూనస్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రకటన చేసిన విద్యార్థి నాయకుల్లో నహీద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్ ఉన్నారు. వీరిద్దరూ అనంతరం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేశారు. ఆగస్టు 8న ఆయన పారిస్ నుంచి ఢాకాకు చేరుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు బాధ్యతలు స్వీకరించారు.

