Bangladesh PM Sheikh Hasina comments on india relations: బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటనకు రాబోతున్నారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య, వ్యాపారం, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనాల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే తన భారత పర్యటనకు ముందు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని షేక్ హసీనా కీలక విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్, శ్రీలంక మార్గంలో వెళ్తుందనే ఆందోనళ నేపథ్యంలో.. షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అన్నారు. కోవిడ్19, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని ఆమె స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ తన అప్పులను సకాలం చెల్లిస్తోందని..రుణాల వల్ల బంగ్లాదేశ్ కు ఉపయోగం ఉంటుందనుకుంటేనే చేస్తున్నామని అన్నారు. కోవిడ్ 19, ఉక్రెయిన్ పరిణామాలు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని.. ఆమె చెప్పకొచ్చారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలాగా బంగ్లాదేశ్ ఎప్పటికీ కాబోదని అన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం బంగ్లాదేశ్ కు సమస్యలను తీసుకువచ్చిందని ఆమె అంగీకరించారు. ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడిందని అన్నారు.
Read Also: India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.
భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై వ్యాఖ్యానించారు. భారత్ తమకు నమ్మదగిన మిత్రుడని అన్నారు ప్రధాని షేక్ హసీనా. 1971 యుద్దంలో, 1975లో భారత్, బంగ్లాదేశ్ కు సహకరించిందని ఆమె తెలిపారు. 1970లో తన కుటుంబం హత్యకు గురైనప్పుడు పేరు మార్చుకుని ఢిల్లీలో నివసించిన కాలాని గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా బంగ్లాదేశ్ విద్యార్థులను భారత్ తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం అని..మైనారిటీలపై దాడులు చేస్తున్నవారిని వదలడం లేదని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నదుల వివాదాలపై చర్చించుకుని పరిష్కరించుకుంటామని అన్నారు.
రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం ఎలా మెరుగుపరుచుకోవాలనే చూడటమే బంగ్లాదేశ్ ప్రాధాన్యత అని అన్నారు. బంగ్లాదేశ్, ఇండియా ఇరుగుపొరుగు దేశాలని.. పొరుగు దేశాలతో స్నేహాన్ని ఎప్పుడూ కోరుకుంటామని అన్నారు. భారత్- చైనాతో సంబంధాలపై.. మాకు ఎవరితోనూ ద్వేషం లేదని.. స్నేహాన్ని కోరుకుంటున్నామని.. సమస్య ఉంటే అది ఇండియా, చైనాల మధ్యే అని ఆమె అన్నారు. చైనా, ఇండియాలు కూడా సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
