బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ ఎన్నికయ్యారు. 35 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మీర్జా ఫక్రుల్ ఘన విజయం సాధించారు. దేశ పార్లమెంటు అయిన జాతీయ సంసద్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మీర్జా ఫక్రుల్ 255 ఓట్లు సాధించారు. నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) నేతృత్వంలోని 11 పార్టీల ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయిన ఓలీ అహ్మద్‌ను ఆలంఘీర్ ఓడించారు. ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మీర్జా ఫక్రుల్ దేశానికి 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 343 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎస్ఎం నాసిర్ ఉద్దీన్ పర్యవేక్షణలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు జరిగాయి. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఫలితాలను ప్రకటిస్తూ.. ఆలంఘీర్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు. గత 35 ఏళ్లలో తొలిసారిగా బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఈ ఎన్నికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో పోటీలో కేవలం ఒకే అభ్యర్థి ఉండేవారు.
ఈసారి ఎన్నికలు ఎలా జరిగాయి?
గత వారం బీఎన్‌పీ ఆలంఘీర్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసిన తర్వాత ఎన్నిక అనివార్యమైంది. బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి పదవికి, పార్టీ జాతీయ స్థాయీ కమిటీ సభ్యత్వానికి ఆలంఘీర్ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, బీఎన్‌పీ ఛైర్మన్ తారిక్ రెహమాన్‌లతో చర్చల అనంతరం ఆలంఘీర్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్లు బీఎన్‌పీ నేత రుహల్ కబీర్ రిజ్వీ తెలిపారు. ఆలంఘీర్‌ను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు.
జాతీయ సంసద్‌లో 350 సీట్లు ఉన్నప్పటికీ ఒక నియోజకవర్గంలో ఎన్నిక నిలిచిపోవడంతో 349 మంది సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. గత నెలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా పదవి నుంచి తప్పుకున్న మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష ఎన్నికల్లో 349 మంది ఎంపీలలో 343 మంది పాల్గొన్నారు.
గత అధ్యక్షుడు రాజీనామా
76 ఏళ్ల షహాబుద్దీన్ ఏప్రిల్ 2023 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తూ.. జూలై 24, 2026న అప్పటి స్పీకర్ హాఫిజ్ ఉద్దీన్ అహ్మద్‌కు తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించి.. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం అధ్యక్షుడి విధులను చేపట్టడం ప్రారంభించారు. షహాబుద్దీన్ ఏప్రిల్ 24, 2023న బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధికార పార్టీ అయిన అవామీ లీగ్ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన ఐదేళ్ల పదవీకాలం ఏప్రిల్ 2028 వరకు కొనసాగాల్సి ఉంది.
60 రోజుల్లోగా ఎన్నికలు
బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు స్పీకర్ దేశాధినేత విధులను నిర్వహిస్తారు. ఆ పదవి ఖాళీ అయిన 90 రోజులలోపు పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కూడా రాజ్యాంగం చెబుతోంది. అయితే గురువారం జరిగిన ఎన్నిక రాజ్యాంగబద్ధమైన గడువులోపే జరిగింది. దీంతో మధ్యంతర ఏర్పాటుకు తెరపడి ఆలంఘీర్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఈ ఎన్నిక బంగ్లాదేశ్‌లో ఒక పెద్ద రాజకీయ మార్పును సూచిస్తుంది. బీఎన్‌పీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు పార్టీ సంస్థాగత నాయకత్వం నుంచి దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎదగడం చరిత్ర సృష్టించారు.

