Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ (తట్టు) వ్యాధి తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా చిన్నారులపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. 2026లో ఇప్పటివరకు అనుమానిత, నిర్ధారిత మరణాలు కలిపి మొత్తం 1,361కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే మరో తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పొరుగున ఉన్న భారత్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘ భూ సరిహద్దు ఉండటంతో సరిహద్దుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అయితే, దీనర్థం భారత్‌లో ప్రస్తుతం దేశవ్యాప్త మీజిల్స్ వ్యాప్తి మొదలైందని కాదు. అప్రమత్తత, వ్యాక్సినేషన్, వ్యాధి పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు మీజిల్స్ కారణంగా 105 మరణాలు నిర్ధారించారు. మరో 1,256 మరణాలు అనుమానిత జాబితాలో ఉన్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,361కు చేరింది. అదే సమయంలో కొత్తగా 1,283 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 2,59,190కి చేరింది. నిర్ధారిత కేసులు మరో 68 పెరిగి 26,300కు చేరుకున్నాయి. చిన్నారుల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుండటంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్లో లోపాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 23న విడుదల చేసిన వ్యాప్తి నివేదిక ప్రకారం.. వ్యాక్సినేషన్లో ఏర్పడిన అంతరాలు, చిన్నారుల్లో రోగనిరోధక శక్తి లోపించడం వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. 2024-2025 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌లో మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ల కొరత ఏర్పడినట్లు WHO పేర్కొంది. దీనికి తోడు సాధారణ టీకా కార్యక్రమాల్లో అంతరాయాలు ఏర్పడటం, 2020 నుంచి దేశవ్యాప్తంగా క్రమం తప్పకుండా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడం కూడా ప్రభావం చూపినట్లు తెలిపింది.
వ్యాధి బారిన పడుతున్న చిన్నారుల్లో గణనీయమైన సంఖ్యలో అసలు టీకాలు తీసుకోనివారు లేదా ఒక డోసు మాత్రమే తీసుకున్నవారు ఉన్నట్లు WHO గుర్తించింది. సాధారణంగా టీకా తీసుకునే వయసుకు చేరుకోకముందే కొంతమంది శిశువులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రమాద స్థాయిని WHO ‘High Risk’గా అంచనా వేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ వ్యాధి వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మాజీ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రాజకీయ, పరిపాలనా నిర్ణయాల కారణంగా వ్యాక్సిన్ల సేకరణ ప్రక్రియకు ఆటంకం కలిగించిందని ఆమె పేర్కొన్నారు. 2026 మార్చిలో మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా అయిపోయాయని, దీంతో టీకా కార్యక్రమాల కవరేజీ తగ్గిపోయిందని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వంపైనా హసీనా విమర్శలు చేశారు. వ్యాధి తీవ్రత తెలిసిన తర్వాత కూడా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
భారత్‌కు కూడా మీజిల్స్ ముప్పు ఉందా?
బంగ్లాదేశ్‌లో వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో భారత్‌కు కూడా సరిహద్దుల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్, కాక్స్ బజార్ వంటి ప్రధాన నగరాలు ప్రయాణ, రవాణా కేంద్రాలుగా ఉండటంతో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బంగ్లాదేశ్‌లో వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో ఉన్న జషోర్, చాపైనవాబ్‌గంజ్ వంటి ప్రాంతాల వద్ద భారత్‌తో రద్దీగా ఉండే భూ సరిహద్దు మార్గాలు ఉన్నాయి. ప్రజల రాకపోకల కారణంగా వైరస్ ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపించే అవకాశం ఉందని WHO అంచనా వేసింది. సరిహద్దుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని గణనీయమైనదిగా, ప్రాంతీయ స్థాయి ప్రమాదాన్ని అధికంగా WHO పేర్కొంది. అయితే భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజీ సాపేక్షంగా మెరుగ్గా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
భారత్‌లో మీజిల్స్ వ్యాక్సినేషన్ పరిస్థితి ఎలా ఉంది?
WHO-UNICEF ఇమ్యునైజేషన్ డేటా ప్రకారం.. 2025లో భారత్‌లో మీజిల్స్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారి శాతం 98గా ఉంది. రెండో డోసు తీసుకున్న వారి శాతం 95గా నమోదైంది. ఈ గణాంకాలు భారత్‌కు కొంత రక్షణ కల్పిస్తున్నప్పటికీ, దేశంలోని ప్రతి చిన్నారికి పూర్తి స్థాయిలో రక్షణ ఉందని చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో టీకాలు తీసుకోని పిల్లలు లేదా ఒక డోసు మాత్రమే తీసుకున్న పిల్లలు ఉండవచ్చు. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) కూడా మీజిల్స్ వైరస్ అంతర్జాతీయ సరిహద్దులను సులభంగా దాటి వ్యాపించగలదని హెచ్చరిస్తోంది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.
మీజిల్స్ వ్యాధి లక్షణాలు ఏమిటి?
మీజిల్స్ అనేది అత్యంత వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా, గాలిలో ఉండే వైరస్ ద్వారా ఇతరులకు సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వైరస్ సోకిన తర్వాత సాధారణంగా 10 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యమైన లక్షణాలు:
తీవ్రమైన జ్వరం
పొడి దగ్గు
ముక్కు కారడం
కళ్లు ఎర్రబడటం, నీరు కారడం
నోటిలో చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడటం
ముఖం లేదా తల భాగం నుంచి మొదలై శరీరమంతా వ్యాపించే ఎర్రటి దద్దుర్లు
ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వ్యక్తి చర్మంపై దద్దుర్లు కనిపించడానికి నాలుగు రోజుల ముందు నుంచి, అవి కనిపించిన తర్వాత మరో నాలుగు రోజుల వరకు ఇతరులకు వైరస్ వ్యాప్తయ్యే అవకాశం ఉంటుంది. చిన్నారుల్లో మీజిల్స్ తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. న్యుమోనియా, మెదడు వాపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మీజిల్స్ నివారణకు వ్యాక్సినేషన్ ఎందుకు ముఖ్యం?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు వ్యాక్సినేషన్లో చిన్నపాటి లోపాలు కూడా ఎంతటి ప్రమాదానికి దారితీయవచ్చో తెలియజేస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే వ్యాక్సినేషన్ కవరేజీ మెరుగ్గా ఉన్నప్పటికీ, నిరంతర అప్రమత్తత అవసరం. ముఖ్యంగా చిన్నారులకు వైద్యుల సూచనల ప్రకారం మీజిల్స్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇప్పించాలి. టీకాలు తీసుకోని పిల్లలను గుర్తించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. అనుమానిత కేసులను వెంటనే గుర్తించి ఆరోగ్య శాఖకు తెలియజేయాలి.
సరిహద్దు ప్రాంతాల్లో వ్యాధి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి. జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. బంగ్లాదేశ్‌లో మీజిల్స్ వ్యాప్తి తీవ్రంగా మారడం పొరుగు దేశమైన భారత్‌కు కూడా ప్రజారోగ్యపరమైన సవాలుగా మారింది. భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజీ అధికంగా ఉండటం సానుకూల అంశమే అయినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, చిన్నారులకు పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ అత్యంత కీలకం.

