Pakistan: పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. బలూచ్ స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్న వ్యక్తుల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ, పాక్ ప్రభుత్వం కిడ్నాప్ చేసి, వారిని హతమారుస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
తాజాగా, పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫజర్ ఉర్ రెహ్మాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ అధికారులు ప్రజల్ని మాయం చేస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని అన్నారు. సంవత్సరాలుగా వేలాది మంది బలూచ్ యువకులు, కార్యకర్తలు బలవంతంగా అదృశ్యమయ్యారు. తమ వారిని ఇవ్వాలని కుటుంబాలు డిమాండ్ చేస్తూ, నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఒక సమావేశంలో జెయుఐ-పి నాయకుడు మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ప్రజల్ని అపహరిస్తోందని అన్నారు. ఈ విషయం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుండి విమర్శలను గుప్పిస్తోంది. అమెరికన్ మానవ హక్కుల న్యాయవాది మరియు పరిశోధకుడు రీడ్ బ్రాడీ బలూచిస్తాన్ ప్రజలకు బలమైన మద్దతును ప్రకటించారు. ఈ అదృశ్యాలపై అంతర్జాతీయ జవాబుదారీతనం, స్వతంత్ర దర్యాప్తులను కోరారు.
పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్‌ను, జిన్నా హయాంలో బలవంతగా పాకిస్తాన్‌లో కలుపుకున్నారు. అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ, అక్కడి జనాభా చాలా తక్కువ. సహజవనరులు, ఖనిజాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. అయితే, ఇక్కడి సంపదను పంజాబ్ అధికారులు, వ్యాపారులు దోచుకుంటున్నారని, చైనా వంటి దేశాలు దోచుకుంటున్నాయని బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) వంటి సంస్థలు సాయుధ తిరుగుబాటు చేస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. తమకు స్వాతంత్య్రం కావాలని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. అయితే, వీటిని పాకిస్తాన్ క్రూరంగా అణిచివేసే క్రమంలో, కిడ్నాపులకు పాల్పడుతోంది.
