NTV Telugu Site icon

Pakistan: బలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..

Pak

Pak

Pakistan: పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్న బీఎల్ఏ తమ ఆధీనంలోకి 100 మందికిపైగా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, బందీలుగా చేసుకున్నట్లు తెలిపింది. ఆరుగురు పాకిస్తాన్ సైనిక సిబ్బంది కూడా ఈ సంఘటనలో మరణించినట్లు వెల్లడించింది.

పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు తొమ్మిది బోగీలలో 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై కాల్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దళాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలను చంపేస్తామని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ సంతకం చేసిన ఒక ప్రకటన తెలిపింది.

బీఎల్ఏ పోరాట యోధులు రైల్వే పట్టాలను పేల్చేసి, రైలును బలవంతంగా ఆపేశారు. ఆ తర్వాత దానిలోకి ఎక్కి ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారు. ఈ ఆపరేషన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి బాధ్యత తీసుకుంటుందని బీఎల్‌ఏ ప్రతినిధి సోషల్ మీడియాలో చెప్పారు.

Read Also: MP: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో ఘర్షణ.. నిందితులకు గుండు గీయించి, ఉరేగించిన పోలీసులు..

ఇదిలా ఉంటే, బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ప్రాంతంలో జరిగిన సంఘటనా స్థలానికి భద్రతా దళాలు చేరుకున్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు విధించిందని మరియు పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంస్థలను సమీకరించామని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ చెపపారు.

బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం కొన్ని దశాబ్ధాలుగా బలూచ్ ప్రజలు పోరాడుతున్నారు. పాకిస్తాన్ తమను అక్రమంగా కలుపుకుందని ఆరోపిస్తున్నారు. బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం అరాచకాలకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ బీఎల్ఏ పోరాడుతోంద. ముఖ్యంగా పాక్ సైన్యం, పోలీసుల్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌(సీపెక్)ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తోంది. పాక్-చైనాల వ్యూహాత్మక ఓడ రేవు గ్వాదర్ పోర్టు ఈ రాష్ట్రంలోనే ఉంది. బలూచిస్తాన్ గ్యాస్, ఖనిన వనరులకు కేంద్రంగా ఉంది. వీటిని పాకిస్తాన్ దోచుకుంటోందని బలూచ్ పోరాట యోధులు ఆరోపిస్తున్నారు.