అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లిపాలు చాలా అవసరం. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికే అందరూ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొందరు తల్లులుకు పాలు రాకపోతే పిల్లలకు సమస్య ఏర్పడుతుంది. భారత్‌లోని మహిళలకు తల్లి పాలు రాకపోవడం అన్న సమస్య అరుదుగానే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం తల్లులకు సరిగ్గా పాలు రావు. అక్కడి మహిళలు ఆధునిక జీవనశైలిని కలిగి ఉండటం వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది. అమెరికాని మహిళలు ఎక్కువగా డ్రగ్స్, మద్యం, ధూమపానం వంటి అలవాట్లతో పాటు ఊబకాయం కలిగి ఉంటారు. దీంతో అక్కడి మహిళల్లో పాల ఉత్పత్తి తగ్గుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలో ఎక్కువ మంది తల్లులు తమ పిల్లలకు ఫార్ములా మిల్క్‌ను ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. అమెరికాలోని మిలియన్ల కుటుంబాలు తమ చిన్నారుల కోసం ఈ ఫార్ములా మిల్క్‌ను ఇస్తుంటాయి. అయితే ప్రస్తుతం అక్కడి పసిపిల్లలకు ఫార్ములా మిల్క్ దొరకడం లేదు. ట్రంప్ హయాంలో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు విధించారు. ఈ ప్రభావంతో పాటు ఇటీవల బైడెన్ సర్కార్ ఫార్ములా మిల్క్ తయారు చేసే కంపెనీలకు మరిన్ని కష్టాలు తెచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఫార్ములా మిల్క్ ఉత్పత్తి, దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేబీ ఫార్ములా మిల్క్‌ను ఉత్పత్తి చేసే ప్రధాన సంస్థ మూతపడటంతో పాల కొరత ఏర్పడింది. ఫలితంగా అమెరికాలో ఎక్కడ చూసినా ఫార్ములా మిల్క్ కొరత కనిపిస్తోంది.