Site icon NTV Telugu

Aung San Suu Kyi: ఆంగ్‌ సాన్‌ సూకీకి క్షమాభిక్ష.. తగ్గనున్న ఆరేళ్ల జైలు శిక్ష

Aung San Suu Kyi

Aung San Suu Kyi

Aung San Suu Kyi: నోబెల్‌ బహుమతి గ్రహీత, మయన్మార్‌ కీలక నేత ఆంగ్‌ సాన్‌ సూకీకి క్షమాభిక్ష లభించింది. సైనిక ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. మయన్మార్‌ లో దేశ వ్యాప్తంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ఆంగ్ సాన్‌ సూకీతోపాటు, మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌ సహా ఏడు వేల మంది ఖైదీలకు అక్కడి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ఆంగ్‌ సాన్‌ సూకీకి క్షమాభిక్షను ప్రసాదించింది. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుందని ఆ దేశ అధికార ప్రతినిధి జా మిన్‌ తెలిపారు. గత వారం సూకీని జైలు నుంచి గృహనిర్భందానికి తరలించారు.

Read also: Trending News: కాబోయే భార్యకు 15 షరతులు.. ఎంత ఘోరంగా ఉన్నాయంటే..!

ఆంగ్‌ సాన్‌ సూకీని 19కిపైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ మయన్మార్‌ కోర్టు ఆమెకు 33ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వీటిలో నాలుగు కేసుల్ని రద్దు చేశారు. తొలిసారిగా 1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. 1991లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెకు నోబెల్‌ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహనిర్భందం నుంచి విముక్తి లభించింది. 2015లో మయన్మార్‌లో జరిగిన ఎన్నకల్లో సూకీ పార్టీ విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ మరోసారి విజయం సాధించింది. 2021లో సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. ఆ తర్వాత సూకీతోపాటు ఆమె అనుచరులపై ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కోర్టు జైలు శిక్ష విధించింది. దాంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. తాజాగా వాటిలో నాలుగు కేసులను కొట్టేశారు. మయన్మార్‌లో ఎమర్జెన్సీని మరోసారి పొడిగిస్తున్నట్లు సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో సోమవారం సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

Exit mobile version