Site icon NTV Telugu

Ukraine Russia Tensions: ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు..!

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్‌ నగరాన్ని ఇప్పటికే రష్యన్‌ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్‌ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్‌లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్‌ ష్రింగ్లా..

Read Also: Ukraine Crisis: పుతిన్‌తో ప్రధాని మోడీ చర్చలు..

ఒక నెల క్రితం ఉక్రెయిన్‌లో భారతీయ పౌరుల నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు వర్ష వర్ధన్‌ ష్రింగ్లా… “ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్” ఆధారంగా సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నామన్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌ నుంచి 4 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.. ఇక, విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్‌కు 980 ఫోన్లు, 850 ఈ-మెయిల్స్‌ వచ్చాయని పేర్కొన్నారు.. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగేరీ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడతారు అని తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా, భారత పౌరుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని మోడీ “భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ” సమావేశంలో పేర్కొన్నారు.. ఇక, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని..ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకున్నారు.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్‌కి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version