Site icon NTV Telugu

Apple Watch: చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?

Apple Watch

Apple Watch

Apple Smartwatch Saves A 12 Year Old Girl: స్మార్ట్‌వాచ్‌ల యందు ఆపిల్ వాచ్ వేరయా.. అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఇవి కేవలం ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, ప్రాణాల్ని కాపాడుతున్నాయి కూడా! ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొందరిని ఈ యాపిల్ వాచ్‌లు గట్టెక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ 12 ఏళ్ల బాలిక ప్రాణాల్ని ఈ యాపిల్ వాచ్ కాపాడింది. అదెలాగో తెలుసుకుందాం పదండి…

ఒక ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ ప్రచురించిన కథనం ప్రకారం.. 12 ఏళ్ల ఇమాని మైల్స్‌కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. తన తల్లిదండ్రుల్ని ఒప్పించి, ఒక యాపిల్ వాచ్ కొనుగోలు చేసి, దాన్ని చేతికి కట్టుకొని తిరగడం మొదలుపెట్టింది. అయితే.. ఈ వాచ్‌లో ఉన్న హెల్త్ ఫీచర్స్ ఇమాని హార్ట్ రేట్ అసాధారణంగా ఉందంటూ పదే పదే అలర్ట్ చేసింది. ఇమాని ఆ అలర్ట్‌ని పట్టించుకోలేదు. బహుశా ఏదైనా నోటిఫికేషన్ రావడం వల్ల అలాంటి అలర్ట్స్ వస్తున్నాయేమోనని అనుకుంది. అయితే.. ఆమె తల్లి జెస్సికా కిచెన్ మాత్రం అలా అనుకోలేదు. పదే పదే అలర్ట్ రావడాన్ని చూసి, ఏదో సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించింది.

దీంతో వెంటనే జెస్సికా తన కుమార్తె ఇమానిని వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఇమాని అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని తేల్చారు. తదుపరి పరీక్షల్లో ఆ ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్‌గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి తొలగించారు. ఇలా ఈ విధంగా.. ఆ యాపిల్ వాచ్ క్యాన్సర్ బారి నుంచి 12 ఏళ్ల బాలికని కాపాడింది. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకపోతే, తాను వైద్యుల వద్దకు కూతుర్ని తీసుకెళ్లేదాన్ని కాదని, ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని జెస్సికా పేర్కొంది.

Exit mobile version