Anti-Hijab Protests in iran: ఇరాన్ లో పది రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే 22 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. పోలీసులు దాడి చేయడంతోనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మూడు దశాబ్ధాల పాలనకు ముగింపు పలకాలని పిలుపునిస్తూ.. రాజధాని టెహ్రాన్ లో ‘‘ నియంతకు చావు’’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. మహ్సా అమిని మరణం తరువాత ఇరాన్ లోని 45 నగరాల్లో, పట్టణాల్లో చివరకు గ్రామాలకు కూడా ఈ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం వ్యాపించింది. అయితే దీని వెనక అమెరికా ఉందని ఇరాన్ విమర్శలు చేస్తోంది. దేశంలో శాంతియుత వాతావరణాన్ని అమెరికా దెబ్బతిస్తోందని.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు అమెరికా కారణం అని ఆరోపిస్తోంది.
Read Also: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పు రిజర్వ్.. సుప్రీంకోర్టులో విచారణ పూర్తి
ఇదిలా ఉంటే ఇరాన్ ఆందోళనల్లో 75 మందికి పైగా మరణించినట్లు హక్కుల సంఘాలు తెలిపాయి. 41 మంది నిరసనకారులు, పోలీసులు మరణించారని 1,200 కంటే ఎక్కువ మంది అరెస్ట్ చేయబడ్డారు. ఇదిలా ఉంటే ప్రభుత్వానికి మద్దతుగా మరికొంత మంది ర్యాలీలు చేపడుతున్నారు. అమెరికన్ కిరాయి సైనికులు మతంతో పోరాడుతున్నారంటూ నినాదాలు చేశారు. నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, వాట్సాప్‌లపై ఆంక్షలు విధించింది. ఇరాన్ నిరసనలు ప్రపంచదేశాలకు తెలియకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు పడుతోంది.
