Site icon NTV Telugu

ఆఫ్గనిస్తాన్‌లో మరో సంక్షోభం…

అతంర్యుద్ధంతో అల్లాడుతున్న ఆఫ్గనిస్తాన్‌ని మరో పెను ప్రమాదం వెంటాడుతోంది. అదే ఆకలి సంక్షోభం. లక్షలాది మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గోధుమ, బియ్యం, చక్కెర , నూనె ధరలు సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో లేడు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు…వలసలు..తాజాగా తాలిబాన్‌ సంక్షోభం. వెరసి ధరలకు రెక్కలొచ్చాయి. కరోనాకు ముందు ధరలతో పోలిస్తే 50 నిత్యావసర సరుకుల ధరలు శాతానికి పైగా పెరిగాయి.స్వచ్చంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ తన నివేదికలో వెల్లడించింది. ఒక్క పోయిన నెలలోనే నిత్యావసరాల ధరలు ఏకంగా 63 శాతం పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిండి, వంట నూనెలు, బీన్స్‌ , గ్యాస్‌ ధరలు నింగిని తాకుతున్నాయి.

ధరలు పెరగటంతో వేలాది కుటుంబాల కనీస అవసరాలు కూడా తీరట్లేదు. కరోనా ఆగమనంతో ఆహారం, ఇంధన ధరలు పెరగటం ప్రారంభమైంది. ఇక మే నెలలో ఆఫ్గన్‌ సంక్షోభం తీవ్రం కావటంతో అన్నిటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక కాబూల్‌ను తాలిబాన్లు చేసుకున్న తరువాత పరిస్థితి చేయి దాటిపోయింది. సరిహద్దులు మూసేశారు …సరుకుల ఎగుమతి దిగుమతులకు అటంకం ఏర్పడింది. దాంతో ఆహార పదార్థాలలో తీవ్ర కొరత ఏర్పడింది. తాలిబాన్లు ఒక్కో ప్రావిన్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవటంతో ఆ ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. స్థానికులు భయపడి మరో ప్రాంతానికి తరలివెళుతున్నారు. అలా వలసలు పెరిగాయి …వేలాది కుటుంబాలు తమ ప్రాంతాన్ని వీడుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. తినటానికి తిండిలేక అప్పులు చేస్తున్నారు.తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను తాకట్టు పెట్టటమో ..అమ్మేయటమో చేస్తున్నారు.

ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపట్లేదు. వారిని పనికి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఐదేళ్ల రాబోవు కాలంలో ఐదేళ్ల లోపు గల లక్షలాది మంది చిన్నారులు ఆకలి సంక్షోభంలోకి నెట్టివేయబడతారని సేవ్ ది చల్ర్డన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్లు జెండా పాతిన తరువాత బయటి సాయం ఆగిపోయింది. అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో చిన్నారుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. సేవ్‌ ది చిల్ర్డనం 1976 నుంచి ఆఫ్గనిస్తాన్‌ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇది నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థ. దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలు, వారి కుటుంబాలకు లైఫ్‌ సేవింగ్‌ సర్వీస్‌లు ఆందిస్తోంది. ఐతే తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి. ఈ సంస్థ తన సేవాకార్యక్రమాల్లో భాగంగా విద్య, ఆరోగ్య, బాలల రక్షణ, పౌష్టికాహారం, లైవ్‌లీహుడ్స్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తోంది. 2020లో 16 లక్షల మందికి ఈ సేవలు అందాయి.

ఇదిలావుంటే, తాలిబాన్ల రీఎంట్రీతో వందలాది అఫ్గానీ కుటుంబాలు అన్నం కోసం అలమటిస్తున్నాయి. మండుటెండలో కాబూల్‌ పార్క్‌లో ఫుడ్‌ అండ్‌ షెల్టర్‌ కోసం బిక్షమెత్తుకుంటున్నారు. తాలిబాన్లు తమ ప్రావిన్స్ లను ఆక్రమించుకోవటంతో చాలా కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి. అయితే తాలిబాన్‌ సంక్షోభం వల్ల స్వచ్చంద సంస్తలు కూడా ఇప్పుడక్కడ లేవు. బ్యాంకులు కూడా మూతపడూ ఉన్నాయి. ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇప్పుడు ఆఫ్గన్ల ఆకలి తీరాలంటే తక్షణ సాయంగా 200 మిలియన్‌ డాలర్లు అవసరమవుతాయి ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ అంచనా వేసింది. దేశంలోని సగం జనాభా సాయం కోరే పరిస్థితిలో ఉన్నారు. అలాగే అక్కడి చిన్నారుల్లో సగం మంది ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.

మరోవైపు, తాలిబాన్‌ సంక్షోభం కారణంగా విదేశీయులతో పాటు చాలా మంది ఆఫ్గన్‌ పౌరులు దేశం విడిచిపోతున్నారు. కాబూల్‌ పేలుళ్ల ముందు వరకు పెద్ద సంఖ్యలో అక్కడి ఎయిర్ పోర్టుకు తరలివెళ్లారు. ఐతే ఎయిర్ పోర్టు సమీపంలో వారికి కనీసం తాగు నీరు కూడా అందుబాటులో లేని దుస్థితి. ఇక అన్నం సంగతి అడగొద్దు. ఆకలి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరో వైపు వారి దుస్థితిని స్థానికులు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ను 40 డాలర్లు …అంటే దాదాపు 3 వేల రూపాయలు, అలాగే ప్లేట్ భోజనానికి 100 డాలర్లు .. మన కరెన్సీలో అయితే 7,500కి అమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే …అంతర్యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్‌ మరో సొమాలియాగా మారే ప్రమాదం ఉందని యావత్‌ ప్రపంచం ఆందోళన చెందుతోంది.

Exit mobile version