అగ్రరాజ్యం అమెరికా, తాలిబన్లు ఒక్కటైపోయారా ? దళాల ఉపసంహరణ నిర్ణయం తర్వాత… తాలిబన్లు అమెరికా సైన్యానికి సహకరిస్తున్నారా ? నాటో దళాల తరలింపునకు… తాలిబన్లు దగ్గరుండి సాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్లు… ప్రజలను అడ్డుకుంటున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలకు వెళ్లేందుకు శరణార్థులుగా వచ్చిన వారిపై కాల్పులు జరిపినా… తమకేమీ తెలియనట్లు నటించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా ? అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో సర్కారు చేస్తోన్నతప్పులకు అంతూపొంతు లేకుండా పోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికిచ్చినట్లు…అంతర్జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ జాబితా ఆధారంగా హిట్‌లిస్టు రూపొందించుకుని… వారి కోసం తాలిబన్లు వెతుకుతున్నారు.
ఆగస్టు 15న కాబుల్ ఆక్రమణ తర్వాత… అమెరికా అధికారులు తాలిబన్లకు ఓ జాబితా ఇచ్చారు. అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ లభించిన వారు, అఫ్గాన్‌లో మిత్రులు ఉన్నారని.. వారిని విమానాశ్రయంలోకి అనుమతించాలని తాలిబన్లకు సూచించారు. ఆ తర్వాత తాలిబన్లు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను…ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో అమెరికాకు సాయం చేసిన వారిని క్రూరంగా చంపిన చరిత్ర తాలిబన్లకు ఉంది. చివరి సమయంలో తాలిబన్లను గుడ్డిగా నమ్మి జాబితాను అప్పజెప్పింది. తాలిబన్లు అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకొనేందుకు… ఇంటింటికీ వెళ్లి సోదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అమెరికాకు వివిధ దశల్లో సాయం చేసిన వేలమంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అమెరికా వీసా కోసం అప్లై చేసిన చాలా మంది.. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించాక విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వారిని కొన్నాళ్లు వేచి ఉండమని సూచించింది. తాలిబన్లకు ఇచ్చిన జాబితాలను క్లియర్ చేసే దాకా…కొత్త వారి పేర్లను తరలించేవారి జాబితాలో చేర్చమని చెప్పింది.
