ఇటీవల కాలంలో అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఆయుధాల తయారీలో అమెరికా అగ్రస్థానంలో ఉండటం కూడా దీనికి కారణం. అయితే గత నెలలో న్యూయార్క్, టెక్సాస్‌లో సామూహికంగా కాల్పులు జరిగాయి. ఆయా ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అమెరికాలో తుపాకుల వినియోగం నియంత్రణకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్ కంట్రోల్ చట్టాన్ని ఆమోదిస్తూ తాజాగా జో బైడెన్ సంతకం చేశారు. దీనివల్ల ఎంతో మంది అమెరికన్ల ప్రాణాలు కాపాడబడతాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా సెనేట్ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం చిన్న వయసులో ఉన్నవారు తుపాకులు కొనడం కష్టతరం అవుతుంది. 21 ఏళ్లలోపు వ్యక్తులు ఆయుధాలు కొనాలంటే తప్పనిసరిగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రమాదకరమని నిర్ధారించబడిన వ్యక్తుల నుంచి అధికారులు సులభంగా తుపాకులు వాపస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా గృహ హింస నేరాలకు పాల్పడిన వారు ఇకపై తుపాకులు పొందడం కష్టసాధ్యంగా మారనుంది. ఈ మేరకు కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది. కాగా దశాబ్దాల తరబడి విస్తృతమైన తుపాకీ హింస నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ భావిస్తున్నారు. బాధితుల వేదన తమను ఏదో ఒకటి చేయాలన్న దిశగా నడిపించిందని, ఇవాళ ఆ పని పూర్తి చేశామని వెల్లడించారు.
