Super continent on Earth in 200 million years: భూమిపై ప్రస్తుతం ఏడు ఖండాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఖండం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చైనా పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే 200-300 మిలియన్ సంవత్సరాల్లో ఆసియా, అమెరికా ఖండం కలిసిపోయి ఒక కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఖండానికి ‘అమాసియా’ అనే పేరును పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా లోని కార్టిన్ యూనివర్సిటీ , చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధనల్లో పసిఫిక్ మహాసముద్రం స్థిరంగా ప్రతీ ఏడాది ఒక అంగుళం తగ్గిపోతుందని తేలింది. దీనివల్ల రాబోయే 200 మిలియన్ ఏళ్ల నుంచి 300 మిలియన్ ఏళ్లలో రెండు ఖండాలు కలిసి పెద్ద ఖండంగా ఏర్పడుతుందని.. అమెరికా, ఆసియా ఖండాలు ఢీ కొంటాయని అంచానా వేశారు.
Read Also: Russia-Ukraine War: జపొరిజ్జాయాపై రష్యా మిస్సైల్ దాడి.. 17 మంది మృతి
రాబోయే 600 మిలియన్ ఏళ్లలో అన్ని ఖండాలు కలిసిపోయి సూపర్ కాంటినెంట్ ను ఏర్పరుస్తాయని.. దీనిని సూపర్ కాంటినెంట్ సైకిల్ అని పిలుస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడున్న ఖండాలు అన్ని కలిసిపోతాయని నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపై టెక్టానిక్ ప్లేట్ల కదలికను అనుసరించి సూపర్ కంప్యూటర్ విశ్లేషన ద్వారా 300 ఏళ్ల కన్నా తక్కువ సమయంలోనే పసిఫిక్ మహా సముద్రం కుచించుకుపోయి అమాసియా ఏర్పడటానికి మార్గం సుగమం అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఆస్ట్రేలియా ఖండం కూడా కీలక భూమిక పోషిస్తుందని వెల్లడించారు. పసిఫిక్ మహా సముద్రం కుచించుకుపోయిన తర్వాత ఆసియా, అమెరికా ఖండాలను కలపడానికి ఆస్ట్రేలియా ఖండం సహకరించనుంది.
కొత్తగా ఏర్పడే సూపర్ కాంటినెంట్ భూమధ్య రేఖకు ఉత్తరంగా భూమిపై భాగంలో ఏర్పడుతుందని.. దక్షిణంలో కేవలం అంటార్కిటా మాత్రమే ఒంటరిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రతీ ఏడాది 7 అంగుళాల చొప్పున ఆసియా వైపు దూసుకు వెళ్తుందని.. యూరేషియా, అమెరికాలు పసిఫిక్ సముద్రం వైపు నెమ్మదిగా కదులుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడితే ఇప్పుడున్న దానికి భిన్నంగా భూమి ఉండనుంది.