Site icon NTV Telugu

Alcor Life Extension: చనిపోయిన వారిని మళ్లీ బతికించే సంస్థ.. ఎలాగంటే?

Reincarnation

Reincarnation

alcor life extension foundation preserve dead bodies in the hope of reincarnation: మృతి చెందిన వారు మళ్లీ తిరిగిరారన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే, అంతిమ సంస్కారాలు చేసి, అక్కడితో వదిలేస్తాం. కానీ.. కొందరు మాత్రం చనిపోయిన తమ కుటుంబీకులు తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఒక సంస్థ చనిపోయిన వారి శరీరాలను భద్రపరుస్తోంది. మృతి చెందిన వారు బతికి రావడం అసాధ్యమైనా, దాన్ని సాధ్యం చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ పేరు అల్కోర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌. ఇది అమెరికాలో ఉంది. చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారో, వారి మృతదేహాల్ని ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తారు.

ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్‌ లైన్‌ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా వాళ్లు చెప్తున్నారు. చనిపోయిన వారిని లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండిన ఒక స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యాంకులో ఉంచుతారు. దీనిని క్రయో ప్రిజర్వ్‌‌ అంటారు. ఇందులో మృతదేహాలను మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు ఉంచుతారు. 2014లో మృతిచెందిన బిట్‌కాయిన్‌ మార్గదర్శకుడు హాల్‌ ఫిన్నీ శరీరాన్ని క్రయో ప్రిజర్వ్‌ చేశారు. అలాగే.. 2015లో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మృతిచెందిన థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్‌ను ఉంచారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తమ పాపని కాపాడుకునేందుకు మెదడుకు ఎన్నో శస్త్రచికిత్సలు చేశారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, తమ పాపా ఏనాడైనా బతికొస్తుందన్న నమ్మకంతో.. ఈ ఫౌండేషన్‌ని సంప్రదించి, ఆ పాప మృతదేహాన్ని క్రయో ప్రెజర్వ్ చేశారు.

ఇందులో మృతదేహాలను రక్షించేందుకు అల్కోర్‌ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్‌ అంటారు. ఈ ప్రక్రియలో వాళ్లు మొదటగా శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాల్ని తొలగించి.. హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద ట్యాంకుల్లో ఉంచుతారు. ఇలా మృతదేహాల్ని భద్రపరుస్తున్నందుకు గాను వాళ్లు సుమారు రూ. 1 కోటి వరకు ఛార్జ్ చేస్తారు. ఇందులో ఇప్పటివరకూ 199 మంది మానవులను, 100 పెంపుడు జంతువుల్ని క్రయో ప్రిజర్స్ చేశారు. మరో 500 మంది తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్‌ చేయడానికి తమ సంస్థను సంప్రదించినట్టు ఫౌండేషన్‌ అధికారులు చెప్తున్నారు.

Exit mobile version