Agent 47: కిరాయి హంతకులుగా మారిపోతున్న యువకులు.. ప్రకంపనలు రేపుతోన్న ‘ఏజెంట్‌-47’

Agent 47

Agent 47

Agent 47: సోషల్ మీడియా అంటే వినోదం, స్నేహాలు, అవకాశాలు మాత్రమే అనుకునే రోజులు మారిపోయాయి. ఇప్పుడు అదే వేదికను అంతర్జాతీయ నేర ముఠాలు తమ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఒక మెసేజ్, ఒక ఆఫర్, భారీగా డబ్బు వస్తుందన్న ఆశ. అంతే… క్షణాల్లోనే సాధారణ యువకులు కిరాయి హంతకులుగా మారిపోతున్నారు. యూరప్ అంతటా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే, నేర ప్రపంచం కొత్త తరాన్ని ఎలా వలలో వేసుకుంటుందో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ రిక్రూట్ మెంట్ విధానం ఇప్పుడు యూరోపియన్ పోలీసు సంస్థ యూరోపోల్ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది.

యూరోపోల్ వెల్లడించిన వివరాల ప్రకారం, యూరప్ లోని వ్యవస్థీకృత నేర ముఠాలు సోషల్ మీడియా, ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ల ద్వారా టీనేజర్లను సంప్రదించి హత్యలు చేయడానికి నియమించుకుంటున్నాయి. లక్షల రూపాయలకు సమానమైన భారీ మొత్తాలను పారితోషికంగా ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, చాలా మంది యువకులు నేరం చేసిన వెంటనే అరెస్టవడంతో ఆ డబ్బు వారి చేతికి చేరకముందే జీవితాంతం జైలు పాలవుతున్నారు. ఈ విధానాన్ని యూరోపోల్ వయోలెన్స్ యాజ్ ఎ సర్వీస్ అనే కొత్త నేర నమూనాగా అభివర్ణించింది. ఇందులో నేర ముఠాలు స్వయంగా రంగంలోకి దిగకుండా, ఆన్ లైన్ ద్వారా యువతను నియమించి ప్రతి అడుగుకు సూచనలు ఇస్తూ వీడియో గేమ్ ఆడిస్తున్నట్లుగా మొత్తం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

ఈ వ్యవస్థ వెనుక ప్రధానంగా స్వీడన్ కు చెందిన ఫాక్స్ ట్రాట్ నెట్ వర్క్ అనే గ్యాంగ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. బీబీసీ పేర్కొన్న సమాచారం ప్రకారం, 2022 నుంచి ఇప్పటివరకు ఈ గ్యాంగ్ దాదాపు 35 హత్యలకు బాధ్యత వహించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు, యూరప్ లోని ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు జరిపిన ఆరోపణలు కూడా దీనిపై ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వంతో ఈ నెట్ వర్క్ కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ నేర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించే ఘటనల్లో స్వీడన్ కు చెందిన అటిల్లా అజిమోవ్ కేసు ఒకటి. డబ్బు కోసం హత్య చేయడానికి అంగీకరించిన 18 ఏళ్ల అజిమోవ్, గత ఏడాది ఫిబ్రవరిలో స్టాక్ హోమ్ లో అసలు లక్ష్యంగా భావించిన వ్యక్తిని పొరబడి మరో 20 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపాడు. అనంతరం కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హత్యకు అంగీకరించినప్పటికీ, అరెస్టవడంతో అతనికి వాగ్దానం చేసిన డబ్బు ఎప్పుడూ అందలేదు.

ఇదే తరహాలో నార్వేకు చెందిన జోహన్నెస్ నాట్ లాండ్ కూడా ఫాక్స్ ట్రాట్ నెట్ వర్క్ తరఫున ఇంగ్లాండ్ లోని వెస్ట్ యార్క్ షైర్ ప్రాంతంలో హత్యకు కుట్ర పన్నిన కేసులో తాజాగా బ్రిటన్ కోర్టులో దోషిగా తేలాడు. అతనికి మొదటగా కిల్లింగ్ ఇన్ ఇంగ్లాండ్ టూ లక్షల డెబ్బై వేల నార్వేజియన్ క్రోనర్ అనే సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అది సుమారు 21 వేల బ్రిటిష్ పౌండ్లకు సమానం. అతడిని జనరాలెన్ అనే ఆన్ లైన్ పేరుతో ఉన్న మరో టీనేజర్ సంప్రదించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అప్పటికి జనరాలెన్ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అతడు కూడా చిన్నారుల సంరక్షణ గృహంలోనే ఉండేవాడు.

తర్వాత నాట్ లాండ్ ను ఏజెంట్ 47 అనే మరో వ్యక్తితో అనుసంధానం చేశారు. ప్రముఖ హిట్ మాన్ వీడియో గేమ్ లోని పాత్ర పేరు నుంచే ఈ మారుపేరును ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏజెంట్ 47 అతనికి మాంచెస్టర్ కు వెళ్లేందుకు వన్ వే విమాన టికెట్ బుక్ చేయడమే కాకుండా అత్యవసర పాస్ పోర్టు పొందడంలో కూడా సహాయపడ్డాడని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సిగ్నల్ అనే ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా హత్యకు సంబంధించిన ప్రతి సూచన అందింది. అడవిలో దాచిన తుపాకులు ఎక్కడ ఉన్నాయో మ్యాప్ లు, వీడియోలు పంపించారు. డబ్బు దాచిన ప్రదేశాల వివరాలు కూడా అందించారు. హోటల్ లో చెక్ ఇన్ చేసిన తర్వాత రేపు మనకు చాలా పని ఉంది అంటూ ఏజెంట్ 47 మరో సందేశం పంపినా, దాడి జరగకముందే బ్రిటిష్ పోలీసులు నాట్ లాండ్ ను అరెస్టు చేశారు.

పోలీసుల దర్యాప్తులో అదే జనరాలెన్, అటిల్లా అజిమోవ్ తో పాటు స్వీడన్ దక్షిణ ప్రాంతంలో మరో వ్యక్తిని కాల్చి చంపిన 17 ఏళ్ల యువకుడిని కూడా నియమించినట్లు బయటపడింది. ఈ నెట్ వర్క్ కు నాయకత్వం వహిస్తున్న రావా మజిద్ స్వీడన్ నుంచి పారిపోయి టర్కీ మీదుగా ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2025లో బ్రిటన్ ప్రభుత్వం మజిద్, ఫాక్స్ ట్రాట్ నెట్ వర్క్ పై ఆంక్షలు కూడా విధించింది.

ఈ నేర వ్యవస్థ వెనుక ఇరాన్ ప్రభుత్వ శత్రువులపై దాడులు చేయించేందుకు ఫాక్స్ ట్రాట్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తున్నారని పరిశోధనాత్మక జర్నలిస్టు డైమంట్ సలిహు ఆరోపించారు. మరోవైపు యూరోపోల్ యూరోపియన్ సీరియస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెంటర్ అధిపతి ఆండీ క్రాగ్, ఇది బలహీన స్థితిలో ఉన్న యువతతో ముందుగానే ప్రణాళిక వేసుకుని హత్యలను అవుట్ సోర్స్ చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన నేర విధానమని వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న ఈ ముప్పును ఎదుర్కొనేందుకు యూరోపోల్ 11 యూరోపియన్ దేశాల పోలీసులతో కలిసి ఓటీఎఫ్ గ్రిమ్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. గత 15 నెలల్లో ఈ బృందం 280 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసింది. వీరిలో ఏజెంట్ 47 పేరుతో కార్యకలాపాలు నిర్వహించినట్లు భావిస్తున్న అలీ షెహాద్ అహ్మద్ కూడా ఉన్నాడు. అతడిని ఇరాక్ లో అరెస్టు చేయగా, స్వీడన్ అతడిని అప్పగించాలని కోరుతోంది. ఫాక్స్ ట్రాట్ నెట్ వర్క్ లో కీలక సభ్యుడిగా భావిస్తున్న మాజీ ర్యాపర్ మహ్మద్ మోయ్గ్లీ మొహ్ధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నెట్ వర్క్ ప్రధాన నేత రావా మజిద్ మాత్రం ఇప్పటికీ ఇరాన్ లోనే ఉండగా, అతడిని ఇప్పటివరకు అరెస్టు చేయలేకపోయారు.