Site icon NTV Telugu

Kabul Blast: మళ్లీ మసీదులో భారీ పేలుడు.. ఇమామ్‌ తో సహా 20 మంది మృతి

Kabul Blast

Kabul Blast

Kabul Blast: వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరం​లో నిన్న సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈఘటనతో అఫ్గానిస్థాన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక ఖైర్‌ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈభారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్‌ తో సహా కనీసం 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. 40 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. వారందరిని ప్రథమ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు అధికారులు.

కాబూల్‌లోని ఉత్తరప్రాంతంలో ఖైర్ ఖానా ప్రాంతంలో ఓ మసీదులో ప్రసాంత వాతావరనంలో ప్రార్థనలు చేస్తుండగా.. ఈపేలుడు సంభవించిందని, భారీ శబ్దంతో పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈదారుణానికి పాల్పడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతమంతా తాలిబాన్ సెక్యూరిటీ గార్డులతో మూసివేశారు. బాధితులకు సహాయం అందిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. తాలిబన్ పాలనను వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వరుస బాంబుదాడులకు పాల్పుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఇది ఏడవ సారి జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆగస్టు నెలలోనే ఇలా జరగడం ఇది రెండోసారి. ఆగస్టు 07న రాజధాని నగరం కాబూల్‌లో రద్దీగా ఉండే ఒక షాపింగ్ స్ట్రీట్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. జులై 29న ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో పేలుడు జరిగింది. పేలుడులో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ లీగ్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. జూన్ 18 రాజధాని కాబూల్ నగరంలోని ప్రఖ్యాత కార్తే పర్వాన్ గురుద్వారాపై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. గురుద్వారా మొత్తాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. అయితే పేలుడులో ప్రార్థనామందిరం పూర్తిగా ధ్వంసమైంది.

ఇక మే 26న కాబూల్ నగరంలోని మజార్-ఇ-షరీఫ్ లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం జరిగిన నాలుగు పేలుళ్లలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ డిస్ట్రిక్ట్ 4లో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 17మంది గాయపడ్డారు. హజ్రత్ -ఎ-జెక్రియా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈపేలుడు సంభవించినట్లు జిన్హువా వార్త సంస్థ తెలిపింది. ఏప్రిల్ 19న పశ్చిమ కాబూల్‌లో హైస్కూళ్లే లక్ష్యంగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. సుమారు 25 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ మేరకు అప్ఘాన్ భద్రతా ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ కాబూల్‌లోని ముంతాజ్ పాఠశాల వద్ద తొలి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇక అదేమాసంలో ఏప్రిల్ 30న అప్ఘన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్‌ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు. మరో వందమంది గాయపడ్డారు. మసీదులు, పాఠశాలలు, చర్చీలు టార్గెట్ చేస్తూ తాలిబన్ పాలనను వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వరుస బాంబుదాడులకు పాల్పుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Astrology : ఆగస్టు 18, గురువారం దినఫలాలు

Exit mobile version