Site icon NTV Telugu

Afghanistan: తాలిబాన్ నేత, డిప్యూటీ ప్రధాని లక్ష్యంగా ఉగ్రదాడి.. 18 మంది మృతి

Afghanistan Bomb Blast

Afghanistan Bomb Blast

Huge Blast At Mosque In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది.

Read Also: Bribe: డీసీపీని రూ.500 లంచం డిమాండ్‌ చేసిన కానిస్టేబుల్.. తర్వాత ఏమైందంటే..?

తాలిబాన్ ముఖ్యనేత, అఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్ గా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తాలిబాన్ నాయకులతో సంబంధాలు ఉన్న.. ప్రముఖ మత గురువు ముజీబ్ ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. అయితే ముల్లా బారాదర్ గురించి వివరాలు వెల్లడించడం లేదు తాలిబాన్ వర్గాలు. అయితే పేలుడుకు ముందు మసీద్ ఇమాం ముజీబ్ ఉల్ రెహమాన్, ముల్లా బరాదర్ ను కలిసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం ప్రార్థనలకు ఎక్కువ మంది హాజరుకావడంతో ఆత్మాహుతి దాడిలో ఎక్కువ మంది మరణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ దాడికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ చేసినట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన వచ్చినప్పటి నుంచి వరసగా దాడులకు పాల్పడుతోంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ. గతంలో మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ.. పలువురిని పొట్టనపెట్టుకుంది ఐసిస్. ముఖ్యంగా షియా, హజారా తెగలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాలిబాన్ నాయకులు లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది.

Exit mobile version