Asteroid: 120 అడుగుల గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందని నాసా అధికారులు గురువారం ధ్రువీకరించారు. అయితే, దీని వల్ల భూమికి, జీవజాలానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. చిన్న పాటి విమానం పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం 2022 SW3 సుమారుగా 1.6 మిలియన్ మైళ్ల కన్నా దగ్గరగా రాబోదని చెప్పింది. ఈ గ్రహశకలం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ వెల్లడించింది. ఇది భూమికి, చంద్రుడికి మూడు రెట్ల దూరం నుంచి వెలుతున్నట్లు చెప్పింది.
Read Also: Ayodhya: జీఐ ట్యాగ్ రేసులో అయోధ్యలోని ప్రసిద్ధ లడ్డూ..
శాస్త్రవేత్తలు 2022 SW3తో సహా తెలిసిన గ్రహశకలాల కక్ష్యలను ట్రాక్ చేస్తారు. నిజానికి, గ్రహశకలాలు సౌర వ్యవస్థ తొలినాళ్లలోని వస్తువులుగా పరిగణిస్తారు. 4.6 బిలియన్ ఏళ్ల క్రితం సౌర కుటుంబ ఆవిర్భావ సమయంలో ఇవి మిగిలిపోయిన వాటిగా గుర్తిస్తారు. 66 మిలియన్ ఏళ్ల క్రితం డైనోసార్లు అంతానికి కారణమైన చిక్సులబ్‌తో సహా కొన్ని గ్రహశకలాలు భూమిపై ప్రభావాన్ని చూపించాయి.
ఇదిలా ఉంటే నాసాతో పాటు పదే దేశాలు ఈ గ్రహశకలాల పరిశోధనలపై దృష్టి సారించాయి. భూమిపై జీవానికి, నీటికి ఆధారం వీటి నుంచి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలా భూమికి సమీపంలోకి గ్రహశకలాలు వచ్చిన సందర్భంలో శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనాలు చేస్తుంటారు. భూమికి సమీపంలో ఉన్న ఈ వస్తువుల భయాన్ని దూరం చేయడానికి అంతరిక్ష సంస్థ నాసా రక్షణ వ్యవస్థను రూపొందించింది. నాసా ప్రపంచంలోనే తొలిసారిగా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట(DART)ని రూపొందించింది. అంతరిక్షంలోని గ్రహశకలాల గమనాన్ని మార్చేలా, అంతరిక్షంలోకి వెళ్లేలా ప్రయోగం చేసింది.