NTV Telugu Site icon

Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..

Google

Google

Google Layoff: ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: IT layoffs: 4 నెలల్లో 3 కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించాయి.. ఓ టెక్కీ ఆవేదన

ఇదిలా ఉంటే తాజాగా గూగుల్ అమెరికాకు చెందిన కేథరీన్ వాంగ్ అనే ప్రోగ్రామ్ మేనేజర్ ని తొలగించింది. ప్రస్తుతం ఆమె తన ఆవేదనను లింక్డ్ ఇన్ ద్వారా వెల్లడించింది. 8 నెలల గర్భిణి, మరో వారంలో ప్రసూతి సెలవులు ఉంటాయి అనే సమయంలో హఠాత్తుగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది గూగుల్. కాలిఫోర్నియాకు చెందిన కేథరీన్, ఉద్యోగం నుంచి తొలగిస్తూ పంపిన ఈమెయిల్ చూడగానే గుండె చలించిపోయిందని పేర్కొంది. కొన్ని రోజుల్లో నా బిడ్డను చూస్తానని అనుకుంటూ సెలవులు తీసుకుంటున్న సమయంలో నా ఫోన్ చూడగానే నా గుండె జారిపోయింది అని, ఉద్యోగం కోల్పోయిన 12,000 మందిలో తాను కూడా ఒకరిని అని లింక్డ్ ఇన్ పోస్టులో రాసుకొచ్చింది.

ఈమెయిల్ చూడగానే ‘‘నేనే ఎందుకు.? ఇప్పుడు ఎందుకు..?’’ అనే ఆలోచన వచ్చిందని.. దీనికి తోడు ఫెర్ఫామెన్స్ రివ్యూ వచ్చిందని, ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం తాను 34 వారాల గర్భిణిని అని.. ప్రసూతి సెలవుల కోసం వెళ్లబోతున్న సమయంలో కొత్త ఉద్యోగం వెతకడం అసాధ్యం అని చెప్పుకొచ్చారు కేథరీన్. చాలా మంది నాబిడ్డ శ్రేయస్సు కోసం ఆందోళన చెందుతున్నారని.. నా గర్భంలో ఓ బిడ్డ ఉందని, నేను నా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్నానని, కానీ నా వణుకుతున్న చేతులను మాత్రం నియంత్రించలేకపోయాను అని, ఇది మిక్డ్స్ ఫీలింగ్ అని అన్నారు.