Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు

  • ఆరేళ్లకే ప్రపంచ రికార్డు
  • రూబిక్స్ క్యూబ్‌ను క్షణాల్లో సాల్వ్ చేసిన చైనా బాలిక
Rubik's Cube World Record

Rubik's Cube World Record

Rubik’s Cube World Record: రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే పెద్దవాళ్లకే చాలా సమయం పడుతుంది. అలాంటిది చైనాకు చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి కేవలం కొన్ని సెకన్లలోనే 3×3 రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. తన అసాధారణ వేగంతో స్పీడ్‌క్యూబింగ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెంగ్డుకు చెందిన లియాన్ యున్‌జీ అనే ఈ చిన్నారిని కుటుంబ సభ్యులు ముద్దుగా ‘జిజి’ అని పిలుస్తారు. మహిళల 3×3 విభాగంలో అత్యంత వేగంగా రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసిన రికార్డును ఆమె నెలకొల్పింది.

4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ పూర్తి

చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ CCTV ప్రకారం.. లియాన్ ఈ నెలలో వుహాన్, గ్వాంగ్‌జౌ నగరాల్లో జరిగిన వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ గుర్తింపు పొందిన రెండు పోటీల్లో పాల్గొంది. ఈ రెండు పోటీల్లోనూ ఆమె మహిళల 3×3 సగటు రికార్డును బద్దలు కొట్టింది. ఒక పోటీలో 4.52 సెకన్ల సగటు సమయాన్ని నమోదు చేసిన లియాన్.. మరో పోటీలో కేవలం 4.27 సెకన్ల సగటు సమయంతో క్యూబ్‌ను పరిష్కరించింది. దీంతో 3×3 రూబిక్స్ క్యూబ్‌లో 4.5 సెకన్ల కంటే తక్కువ సగటు సమయాన్ని నమోదు చేసిన తొలి మహిళా స్పీడ్‌క్యూబర్‌గా ఆమె నిలిచినట్లు CCTV వెల్లడించింది.

వీడియోలో అదరగొట్టిన చిన్నారి

లియాన్ రూబిక్స్ క్యూబ్‌ను వేగంగా తిప్పుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు హెయిర్‌బో ధరించిన ఆమె.. క్యూబ్‌ను క్షణాల్లో సాల్వ్ చేసి టేబుల్‌పై ఉంచుతుంది. అనంతరం చప్పట్లు కొడుతూ, ఆనందంతో చేతిని పైకి ఎత్తుతుంది.

రోజూ 2 నుంచి 3 గంటల ప్రాక్టీస్

లియాన్ తల్లి లిన్ యాంగ్షీ మాట్లాడుతూ.. చిన్నతనంలో ఓ క్లాస్ సందర్భంగా తన కుమార్తెకు తొలిసారి రూబిక్స్ క్యూబ్ పరిచయమైందని చెప్పారు. ఆ సమయంలో లియాన్ డ్యాన్స్, మ్యూజిక్ వంటి ఇతర కార్యకలాపాలను కూడా నేర్చుకునేది. అయితే రూబిక్స్ క్యూబ్ పిల్లలలో పలు సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆమె తల్లి గుర్తించారు. దీంతో లియాన్ దీనిపై మరింత ఆసక్తి పెంచుకుని సాధన చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం లియాన్ 1,300కు పైగా రూబిక్స్ క్యూబ్ అల్గారిథమ్‌లను నేర్చుకున్నట్లు సమాచారం. ప్రతిరోజూ సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఆమె ప్రాక్టీస్ చేస్తోంది.

కేవలం వేగం మాత్రమే కాదు.. లాజికల్ థింకింగ్ కూడా

రూబిక్స్ క్యూబ్ కేవలం వేగంగా పరిష్కరించే పజిల్ కాదని లియాన్ తల్లి చెబుతున్నారు. దీన్ని సాల్వ్ చేయడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన, ఒక సమస్యను వివిధ కోణాల్లో చూడగల సామర్థ్యం పెరగవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా.. సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

ఆరేళ్ల వయసులోనే ఎన్నో ట్రోఫీలు

లియాన్ ఇంట్లో ఆమె సాధించిన విజయాలకు సంబంధించిన ఎన్నో ట్రోఫీలు ఉన్నాయి. కేవలం ఆరేళ్ల వయసులోనే రూబిక్స్ క్యూబ్‌లో ఇలాంటి అసాధారణ ప్రతిభ చూపడంతో ఆమె కథ చైనా మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.