NTV Telugu Site icon

America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు

America Shooting

America Shooting

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షికాగో సమీపంలోని హైలాండ్‌ పార్క్‌లో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, దాదాపు24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. పరేడ్‌ జరగుతుండగా సమీపంలోని ఓ రిటైల్‌ స్టోర్‌పై నుంచి సాయుధుడు కాల్పులకు దిగాడు. కాల్పులతో భయాందోళనకు లోనై అక్కడికి వచ్చిన ప్రజలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు బైడెన్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరుగడం గమనార్హం.

ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని యూఎస్ ఏజెన్సీలు గుర్తించాయి. ఆ వ్యక్తి ‘రాబర్ట్ ఇ క్రిమో III’గా గుర్తించినట్లు వాషింగ్టన్ టైమ్స్ నివేదించింది. అతను చాలా ప్రమాదకరమైన నేరస్థుడిగా పరిగణింపపడ్డాడని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. క్రిమో చికాగో ఉత్తర శివారు ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 22 ఏళ్ల నిందితుడు సిల్వర్ రంగులోని హోండా ఫిట్‌ను నడుపుతున్నట్లు భావిస్తున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం ఎఫ్‌బీఐ పోలీసులకు సాయం అందిస్తోంది.  జులై 4, 2022న సుమారు ఉదయం 10 గంటలకు ఇల్లినాయిస్‌లోని హైలాండ్ పార్క్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పలువురి వ్యక్తులపై కాల్పులు జరిపినందుకు అతనిని (రాబర్ట్ ఇ. క్రిమో, III) వెతుకుతున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మరణించారని.. 24 మంది గాయపడ్డారని వెల్లడించింది. .

స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో జరిగిన తుపాకీ హింసపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్న షూటర్ కోసం అత్యవసర శోధనలో సహాయం చేయడానికి ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కూడా పెంచినట్లు తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బైడెన్‌ ఆకాంక్షించారు.