China: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పిజి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో 31 మంది దుర్మరణం పాలయ్యారు. వాయువ్య చైనాలోని యిన్‌చువాన్‌లోని రెస్టారెంట్‌లో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. బార్బెక్యూ రెస్టారెంట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీకైంది. 31 మంది మరణించడంతో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Read Also: PM Modi US Visit: బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ గిప్ట్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా గ్రీన్ డైమండ్..
మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కృషి చేశాయి. పేలుడు ధాటికి రెస్టారెంట్ అద్దాలు ఎగిరిపడ్డాయి. బుధవారం రాత్రి 8.40 గంటలకు నింగ్జియా ప్రావిన్సులోని రాజధాని డౌన్‌టౌన్ యిన్‌చువాన్‌లోని నివాస ప్రాంతంలోని ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్‌లో జరిగింది. మూడు రోజులు పాటు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవు దినం సందర్భంగా చాలా మంది సరదాగా బయటకు వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించింది.
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రజలను రక్షించాలని అధికారులను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశించారు. పేలుడు నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక, రెస్య్కూసేవలు అందించేందుకు 100 పైగా సిబ్బంది, 20 వాహనాలు సంఘటన స్థలానికి చేరాయి. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించి, సాధ్యమైనంతవరకు ప్రాణనష్టం తగ్గించేందుకు అధికారులు ప్రయత్నించారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు రెస్య్కూ ఆపరేషన్ ముగిసింది.