Site icon NTV Telugu

Afghanistan: ఆఫ్ఘాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్యాంకర్ ఢీ.. 21 మంది మృతి..

Afghanistan

Afghanistan

Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని హెల్మండ్ ప్రావిన్సులో ఆదివారం బస్సు-ఆయిల్ ట్యాంకర్, మోటార్ బైక్ ఢీకొనడంతో 21 మంది మరణించారు. 38 మంది గాయాపడినట్లు ప్రావిన్షియల్ అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘానిస్తాన్ మొత్తం సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడం, కొండలు-పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.

Read Also: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి

‘‘ఆదివారం ఉదయం ఒక ట్యాంకర్, మోటార్ బైక్, ప్రయాణికులు బస్సు ఢీకొనడంతో 21 మంది మరణించారు, 38 మంది గాయపడ్డారు’’ అని ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. హెల్మండ్ ప్రావిన్స్ గ్రిష్క్ జిల్లాలోని హెరాత్-కాందహార్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో వాహనాలకు మంటలు అంటుకోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలు కాగా, 27 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

హెరాత్ నగరం నుంచి రాజధాని కాబూల్‌కి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, బైక్‌ని ఢీకొట్టింది, దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్‌కి మంటలు అంటుకున్నాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆయిల్ ట్యాంకర్‌లోని ముగ్గురు, బస్సులోని 16 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 2022లో ఆయిల్ ట్యాంకర్‌తో కూడిన మరో ప్రమాదం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లోని ఎత్తైన సలాంగ్ పాస్‌లో వాహనం బోల్తా పడటంతో మంటలు చెలరేగి 31 మంది మరణించారు.

Exit mobile version