NTV Telugu Site icon

Mid-Air Collision: 35 వేల అడుగుల ఎత్తులో రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Untitled 1 Copy

Untitled 1 Copy

ఏ మాత్రం అటూ ఇటూ అయిన రెండు విమానాలు ఆకాశంలోనే ఢీకొట్టేవి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పుగా ఆదేశాలు ఇచ్చినా.. ఫైలెట్ల నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదం తప్పింది. ఈ ఘటన జూన్ 13న టర్కీ గగనతలంలో జరిగింది.

లండన్ నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ ఫ్లైట్ యూఎల్ 504 ప్రయాణిస్తున్న సందర్భంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తోంది. ఈ రెండు విమానాలు కూడా 15 మైళ్ల దూరంతో ఉన్న సమయంలో అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ శ్రీలంక విమానాన్నికూడా బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రయాణిస్తున్న 35,000 అడుగుల ఎత్తులో ఎగరాలని తప్పుగా ఆదేశాలు జారీ చేసింది. కొద్ది పాటి నిర్లక్ష్యంతో ఉన్నా రెండు విమానాలు గాలిలోనే ఢీ కొనేవి. ఈ సమయంలో శ్రీలంక విమనాంలో 275 మంది ఉండగా.. బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో 250 మంది ఉన్నారు.

అయితే టర్కీ అంకారాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ శ్రీలంక విమానాన్ని 33 వేల అడుగుల నుంచి 35 వేల అడుగులకు చేరాలని సూచించినా.. శ్రీలంక ఎయిర్ లైన్స్ పైలెట్లు నిరాకరించారు. 35 వేల అడుగుల ఎత్తులో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం వస్తున్నట్లు గమనించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. అంకారా ఎయిర్ ట్రాఫిక్ రెండు సార్లు తప్పుగా 35 వేల అడుగులకు చేరాలని సూచించినా పైలెట్లు నిరాకరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ అత్యవసరంగా స్పందించి శ్రీలంక విమానాన్ని 33 వేల అడుగుల్లోనే కొనసాగాలని సూచించింది. దీంతో 2 వేల అడుగుల ఎత్తు తేడాతో ఇరు విమానాలు వెళ్లిపోయాయి. శ్రీలంక విమానం కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత పైలెట్లను శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ ప్రశంసించింది.