NTV Telugu Site icon

US: అమెరికాలో దారుణం.. విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు లభ్యం

Jetblue

Jetblue

అమెరికా ఎయిర్‌పోర్టులో రెండు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఫ్లోరిడా విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు కనిపించాయి. ఫోర్ట్ లాడర్‌డేల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి చక్రాల దగ్గర రెండు మృతదేహాలు ఉన్నట్లు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 11 గంటల తర్వాత విమానం ఫోర్ట్ లాడర్‌డేల్‌కు చేరుకుంది. తనిఖీల సమయంలో రెండు మృతదేహాలు బయటపడినట్లు ఎయిర్‌లైన్ చెప్పుకొచ్చింది. మృతులు ఎవరినేది ఇంకా తెలియలేదని.. అలాగే ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

విమానం ప్రారంభ సమయంలో ఏం జరిగిందో గుర్తించాలని.. అలాగే ఆ వ్యక్తులు ఎలా అందులోకి వచ్చారన్న సంగతి కూడా దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎయిర్‌లైన్ వెల్లడించింది. ఈ ఘటన మాత్రం విషాదకరమైన ఘటనగా పేర్కొంది. అధికారులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పారామెడిక్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే అమెరికాలో గడిచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. డిసెంబర్‌ చివరిలో షికాగో నుంచి మౌయీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లోనూ మృతదేహం లభ్యమైంది.

Show comments