162 Killed In Indonesia Earthquake Hundreds Injured: ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా.. జావా ద్వీపం అతలాకుతలం అయ్యింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.6గా భూకంప తీవ్రంగా నమోదైంది. చియాంజుర్ ప్రాంతం దాదాపు ధ్వంసమైపోయింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో.. తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ భూకంపం కారణంగా.. ఇప్పటివరకు 162 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని, అందునా విద్యార్థులే అధికంగా ఉన్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. సుమారు 700 మందికి పైగా గాయాలపాలైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోవడంతో.. చాలామంది ఆరుబయటే చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చియాంజుర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ దీని ప్రభావం కనిపించింది. అక్కడి అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు సైతం కంపించాయి. దీంతో.. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. జావాలో సాయంత్రం వరకు.. 1.5 నుంచి 4.8 తీవ్రతతో భూమి పలుమార్లు కంపించింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో.. జావా ద్వీపం వణికిపోయింది. రాత్రి 9:16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జనావాసాలు నేలమట్టం అయ్యాయి. ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 25 మంది చనిపోగా, 460 మంది గాయపడ్డారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంప ధాటికి 100మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది.
