NTV Telugu Site icon

Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు

Africanmigrants

Africanmigrants

ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. మౌరిటానియాలో సముద్రం మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM)  బుధవారం తెలిపింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలో వలస విషాదాల్లో ఇదొక ఘోరమైన సంఘటనగా తెలిపింది.

సుమారు 300 మంది వలసదారులతో వెళ్తున్న బోటు మారిటానియా రాజధాని నాఖ్కోట్‌ సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సమాచారం అందుకున్న కోస్టు గార్డు సిబ్బంది 120 మందిని రక్షించినట్లు బుధవారం ఐఓఎం ఒక ప్రకటనలో తెలిపింది. దురదృష్టవశాత్తు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు  వెల్లడించింది. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది. ఇక 10 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపింది. ఎక్కువగా పిల్లలే ఉన్నట్లుగా తెలిపింది. సముద్రం మధ్యలోకి వెళ్లాక.. మునిగిపోయినట్లుగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం.. పేదరికం, నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఆఫ్రికన్లు మెరుగైన భవిష్యత్తు కోసం యూరప్‌కు ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నట్లు ఐఓఎం తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 20వేల మంది వలసదారులు ఈ ద్వీపాలకు వెళ్లినట్లు ఐఓఎం చెబుతోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. గతేడాది ఈ మార్గంలో ప్రయాణించిన వారిలో కనీసం 1,950 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఐఓఎం అంచనా వేస్తోంది.