Site icon NTV Telugu

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం..

Afghanistan

Afghanistan

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని హెరాత్ ప్రావిన్సులో శనివారం 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ధాటికి ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారు. చాలా భవనాలు కూలిపోయాయి. కూలిన భవనాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరమైన హెరాత్‌కి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో ఐదు భూకంపాలు వచ్చినట్లు తెలిపింది. సుమారుగా ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధి ముల్లా జాన్‌సయేక్ తెలిపారు.

Read Also: Israel: ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామన్న ప్రధాని మోడీ.. ప్రపంచ నేతల మద్దతు..

గంట పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. హెరాత్ పట్టణంలోని విధుల్లోకి మహిళలు, పిల్లలు వచ్చారు. ప్రాథమిక సమచారం ప్రకారం వందల మంది ఈ భూకంపంలో చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లొ 5.9 తీవ్రతలో భూకంపం వచ్చింది. దీనివల్ల 1000కి పైగా మంది చనిపోయారు. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఈశాన్య ఆఫ్ఘానిస్తాన్ లో జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల పాక్-ఆఫ్ఘన్లలో 13 మంది మరణించారు.

ఆఫ్ఘన్ తరుచుగా భూకంపాల బారిన పడుతోంది. హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భూమి అడుగున యురేషియన్ టెక్టానిక్ ప్లేట్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది. దీంతో ఈ రెండు పలకలు రాపిడి వల్ల భూకంపాలు వస్తున్నాయి.

Exit mobile version