అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ పండగ సమయంలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం తలెత్తింది. ఓ వైపు క్రిస్మస్ ప్రయాణాలు.. ఇంకోవైపు శీతాకాల తుఫాను ప్రభావం విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా అంతటా తీవ్ర మంచు కురవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు విమాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి. ఇక క్రిస్మస్ ప్రయాణాలు కారణంగా శుక్రవారం విపరీతమైన రద్దీ నెలకొంది. ఇంకోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో దాదాపు 1,100 విమానాలు రద్దు కాగా.. 4, 000 విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయ ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఎయిర్‌లైన్స్ సంస్థలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌లో రాత్రిపూట 10 అంగుళాల మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇంకోవైపు కాలిఫోర్నియా, మిడ్‌వెస్ట్, ఈశాన్య ప్రాంతాల్లో తీవ్రమైన శీతాకాల తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. వెబ్‌సైట్ ప్రకారం న్యూయార్క్ ప్రాంత విమానాశ్రయాలలో 785 విమానాలు రద్దు అయ్యాయి. ఇక విమానాలు రద్దుతో రీబుకింగ్ చేసుకునే అవకాశాన్ని సంస్థలు కల్పించాయి.
